విజయవాడ, డిసెంబర్ 10,
బందరు పోర్టు నిర్మాణంపై మళ్లీ ప్రజాభిప్రాయసేకరణకు కాలుష్య నియంత్రణ మండలి పూనుకుంది. 2016లో ఇచ్చిన పర్యావరణ అనుమతుల గడువు పూర్తవ్వడంతో ఈ నెల 15న ప్రజాభిప్రాయాన్ని మళ్లీ సేకరించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పోర్టు ప్రభావిత ప్రాంతాలైన మచిలీపట్నం, పెడన, గూడూరు, బంటుమిల్లి తదితర మండలాల ప్రజలతో మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నారు. పోర్టు నిర్మాణం కారణంగా వాయు, శబ్ద కాలుష్యం ఏర్పడుతుందా? పంటలకు, ఆక్వా, సాల్ట్ పరిశ్రమలకు ఏమైనా నష్టం జరుగుతుందా? అనే అంశాలపై ఆయా ప్రాంతాల నుంచి సమావేశానికి హాజరయ్యే ప్రజల నుంచి వివరాలు సేకరిస్తారు. వాటిని పరిశీలించి పోర్టు నిర్మాణానికి తిరిగి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.బందరు పోర్టు నిర్మాణానికి, రైల్వే, రోడ్డు అనుసంధానానికి 1,557 ఎకరాలు సేకరించాలి. పోర్టు నిర్మాణానికి మొత్తం 3,762 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రభుత్వ భూమి, భూ సమీకరణ, భూ సేకరణ పద్ధతుల ద్వారా 2,328 ఎకరాలను సేకరించారు. ఇంకా 1,434 ఎకరాలు సేకరించాల్సి ఉంది. 3.6 కిలోమీటర్లు 60 మీటర్ల వెడల్పుతో రైల్వే లైను, 3.5 కిలోమీటర్లు 50 మీటర్ల వెడల్పుతో ప్రధాన రోడ్లు అనుసంధానానికి 224 ఎకరాలు అవసరం అవుతుందని అంచనా వేశారు. ఇప్పటికి 100.50 ఎకరాలు సేకరించారు. మరో 123.5 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూ సేకరణకు సంబంధించి గతంలో ఇతర కార్పొరేషన్ల నుంచి తీసుకున్న నిధుల్లో రూ.13 కోట్లు మిగిలి ఉన్నాయి. ఈ నిధులతోనే భూ సేకరణకు మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ముందుకెళ్లనుంది.పోర్టు, రోడ్డు, రైల్వే మార్గాల అనుసంధానికి ఇప్పటికి ఎంత భూమి సేకరించారు? ఇంకెంత సేకరించాల్సి ఉందనే అంశాన్ని నిర్ధారించుకున్నాం. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలోనే అవసరమైన మొత్తం భూమిని సేకరిస్తాం. దీనికి రూ.13 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి.