హైదరాబాద్, డిసెంబరు 10,
కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోచంపల్లి, గద్వాల్, నారాయణ పేట, దుబ్బాకలో పవర్ లూం క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై కేంద్ర చేనేత జౌళి శాఖ, ఆర్థిక మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ధ్వజమెత్తారు. క్లస్టర్లు ఏర్పడితేనే ఎంతో అభివృద్ధి జరుగుతుందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.రాబోయే కేంద్ర బడ్జెట్‌లో క్లస్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా స్పందించాలన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి రావాలన్నారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తే ఊరుకోమని హెచ్చరించారు. చేనేత కార్మికుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది. కేంద్రం కూడా సహకరించాలి.. కేంద్రం సహకరించకపోతే ఊరుకోమని చెప్పారు. పీఎం మిత్రలో చేర్చి రూ. వెయ్యి కోట్లు మంజూరు చేయాలి అని డిమాండ్ చేశారు.