YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

సినిమా స్టైల్లో ఏటీఎంలో దొంగలు

సినిమా స్టైల్లో ఏటీఎంలో దొంగలు

నిజామాబాద్, డిసెంబరు 10,
యథార్థంగా జరిగిన పలు చోరీ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘ఖాకీ’ సినిమాలో హీరో కార్తి, అతడి సహచర పోలీసులు దొంగలను పట్టుకునేందుకు ఎన్ని కష్టాలు పడతారో కళ్లారా చూశాం. అందులో నిందితులు లారీల్లో వచ్చి రహదారి వెంబడి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడి తిరిగి తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోతుంటారు. ఇదే తరహాలో నిజామాబాద్‌ జిల్లా ఇందల్‌వాయిలో లారీ ముఠా ఏటీఎంలో నగదు దోచుకెళ్లింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు డిచ్‌పల్లి సీఐ రఘునాథ్‌ ఆధ్వర్యంలో 50 రోజులుగా ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఏటీఎంను దోచుకుంది హరియాణా ముఠాగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు వాళ్లను పట్టుకునేందుకు ‘ఖాకీ’ సినిమాలోలాగ సాహసం చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇండియన్‌ బ్యాంకు ఏటీఎంలో అక్టోబర్ 18 అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంను ధ్వంసం చేసిన దుండగులు అందులోని రూ. 11.31 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఈ చోరీ ఘటనపై అప్రమత్తమైన కమిషనరేట్‌ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారు. పలుచోట్ల గాలింపు జరిపినా, సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు ఘటన జరిగిన రోజున ఏటీఎం కేంద్రానికి సమీపంలో వినియోగంలోని చరవాణి నంబర్ల డంపుని పరిశీలించగా.. దిల్లీ, హరియాణా ప్రాంతాలకు చెందిన అనుమానిత నెంబర్లు వెలుగుచూశాయి.ఈ కేసులో ఇప్పటి వరకు లభించిన ఆధారాలు పరిశీలిస్తే... లారీని జాతీయ రహదారి పక్కన నిలిపి ఏటీఎం వరకు నడుచుకొంటూ వెళ్లారు. సిలిండర్‌ను సైతం ఎవరికీ అనుమానం రాకుండా వెంట తీసుకెళ్లారు. ఈ చోరీలో ఇద్దరు పాల్గొన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. పక్కా ప్రొఫెషనల్‌ ముఠా కావడంతో వీరు మరోమారు చోరీకి బయలుదేరితే గానీ మన పోలీసులకు చిక్కే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇందల్‌వాయి నుంచి బయలు దేరిన దుండగులు తమ రహస్య ప్రదేశం పల్వాల్‌కు వెళ్లాలంటే 1,325 కి.మీటర్లు ప్రయాణించాలి. ఇందుకు రోజంతా సమయం పడుతుంది. వారు దోచుకెళ్లడమేమో గానీ దర్యాప్తు అధికారులు మాత్రం అష్టకష్టాలు పడుతున్నారు. వారి రవాణా, ఇతర ఖర్చుల భారం తడిసిమోపెడవుతున్నట్లు సమాచారంఅక్టోబరులో ఒక సీఐ, ఎస్సై, ఇద్దరు సిబ్బంది నేతృత్వంలో ఓ బృందం దిల్లీ వెళ్లింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో గాలింపు జరిపి కొద్ది రోజులకు తిరిగొచ్చేసింది. తాజాగా మరిన్ని ఆధారాలు లభించడంతో పది రోజుల కిందట ఓ బృందం హరియాణాకు వెళ్లింది. పల్వాల్‌ జిల్లాలోని అతీన్‌ తదితర చోట్ల అనుమానితులు ఉన్నట్లు చరవాణి సిగ్నళ్ల ఆధారంగా గుర్తించింది. తదుపరి దర్యాప్తులో భాగంగా అక్కడి పోలీసు ఉన్నతాధికారులను కలిసినా దుండగులను పట్టుకొనే వీల్లేకుండా పోయింది. అనుమానితులు ఉంటున్న ప్రాంతంలోకి పోలీసులు ధైర్యంగా వెళ్లే పరిస్థితి లేదు. దీంతో పాటు ‘ఖాకీ’ సినిమా తరహాలో పోలీసులపైనే దాడులు చేసే పరిస్థితి నెలకొంది. దీంతో ఓ బృందం అక్కడి నుంచి కమిషనరేట్‌కు తిరిగి వచ్చేసింది. తిరిగి సీసీఎస్‌ బృందం పల్వాల్‌ జిల్లా సమీపంలో మకాం వేసి అనుమానితులు గ్రామం దాటి ఎప్పుడు బయటకు వస్తారా? అని వేచి చూస్తోంది. ఈ కేసువల్ల నిజామాబాద్ పోలీసులు సినిమా కష్టాలు పడాల్సి వస్తోంది.

Related Posts