న్యూఢిల్లీ, డిసెంబర్ 10,
దేశ వీరుడికి జనం వందనాలు పలికారు. భరత భూమి పుత్రుడు రావత్ అమర్ రహే అంటూ నినాదాలు హోరెత్తాయి. ఢిల్లీలో కామ్‌రాజ్‌మార్గ్‌లోని తన నివాసం నుంచి బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటిక వరకు జనరల్ బిపిన్ రావత్ అంతిమయాత్ర కొనసాగింది. వీర నాయకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు జనం భారీగా హాజరయ్యారు. పార్దీవదేహాంతో వెళ్తున్న వాహనంపై జనం పూవ్వులు కురిపించారు. కొందరు యువత జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకుని ఆ వాహనం వెంట పరుగులు తీశారు.సేన ఆధునీకరణ కోసం అంతిమ క్షణాల వరకు జీవితాన్ని అర్పించిన బిపిన్ రావత్‌కు ఘన వీడ్కోలు లభించాయి. రోడ్డుకు ఇరువైపుల నిలబడ్డ జనం.. పువ్వులు కురిపిస్తూ.. త్రివర్ణ జెండాలను ఊపుతూ తమ దేశభక్తిని చాటారు. వీర సైనికుడు బిపిన్ రావత్ అంతిమయాత్రలో.. ఇండియన్ ఆర్మీ జిందాబాద్.. వందేమాతరం అంటూ నినాదాలు కూడా మారుమోగాయి.వ్యూహాలు, ప్రణాళికలతో శత్రువుల గుండెల్లో దడపుట్టించిన బిపిన్ రావత్.. ఈ లోకాన్ని అనూహ్యంగా విడిచి వెళ్లారు. బుధవారం తమిళనాడులో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఆయన దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో బిపిన్ రావత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు తమిళనాడు ప్రజలు భావోద్వేగ పూరితంగా తుది వీడ్కోలు పలికారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్నుమూసినవారి పార్థివదేహాలను 13 అంబులెన్స్‌లలో వెల్లింగ్టన్ ఆర్మీ ఆస్పత్రి నుంచి సూలురు ఎయిర్ బేస్‌కు గురువారం మధ్యాహ్నం తరలించారు. ఈ మార్గంలో మెట్టుపాల్యం నుంచి సూలురు వరకు సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి అంబులెన్స్‌లపై పూలవర్షం కురిపించి నివాళులర్పించారు. ‘భారత్‌మాతాకీ జై’, ‘వీర వణక్కం.. వీర వణక్కం’ (వీరులకు వందనం) అంటూ నినాదాలు చేశారు.ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి ఢిల్లీకి చేరుకున్న జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ పార్దీవదేహాలకు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా పాలం విమానాశ్రయానికి వెళ్లి రావత్ దంపతులకు నివాళులర్పించారు. మోదీ వెంట రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు ఉన్నారు.హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఢిల్లీ, హరియాణా ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, మనోహర్‌లాల్ ఖట్టర్, ఫ్రాన్స్, ఇజ్రాయేల్ రాయబారులు తదితరులు శుక్రవారం ఉదయం కామరాజ్ రోడ్డులోని రావత్ నివాసానికి చేరుకుని దంపతుల పార్ధీవదేహాలపై పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ మతాలకు చెందిన పెద్దలు రావత్ పార్ధీవదేహం వద్ద నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ప్రధాని నివాళి
తమిళనాడులో జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ దంపతులతో సహా మరో 11 మంది సైనిక సిబ్బంది పార్థివ దేహాలు దేశ రాజధాని ఢిల్లీ పాలెం ఏయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్‌బేస్‌కు మృతదేహాలను తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, త్రివిధ దళాధిపతులు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారునీలగిరి జిల్లా వెల్లింగ్టన్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కళాశాల సమీపంలో భారత వాయుసేనకు చెందిన ఎంఐ 17వీ5 హెలికాప్టర్ కూప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బిపిన్ రావత్‌తో సహా 13 మంది ప్రాణాలను కోల్పోయారు. సల్లూరు ఎయిర్ బేస్ నుంచి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మంది ఆర్మీ అధికారుల పార్థీవ దేహాలను ఆర్మీ ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్ట్‌కు తరలించారు. ఎయిర్ పోర్ట్‌లో ఆర్మీ అధికారుల పార్ధీవ దేహాలకు త్రివిధ దళాలు నివాళులు ఆర్పించాయి. మొదట ఎయిర్ చీఫ్ మార్షల్ నివాళులు ఆర్పించారు. ఆ తరువాత ఆర్మీ అధికారులు, నేవీ అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం పాలెం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీతో సహా అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులు ఆర్పించారు.
అనవసర అపోహలు వద్దు
తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 కూలిన ఘటనలో సీడీఎస్ చీఫ్ బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై అసంబద్ధ ప్రచారాలు జరుగుతున్నట్లు ఇవాళ వాయుసేన తన ట్విట్టర్‌లో తెలిపారు. నిరాధార ఆరోపణలను ఆపేయాలని ఆ ట్వీట్‌లో ఐఏఎఫ్ కోరింది. త్వరలోనే ప్రమాద ఘటనకు చెందిన వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పింది. రావత్ దంపతులతో పాటు రక్షణదళ సిబ్బంది మృతి పట్ల త్రివిధదళ దర్యాప్తు చేపట్టనున్నట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ తెలిపిన విషయం తెలిసిందే. త్వరితగతిన ఈ ఘటన పట్ల విచారణను పూర్తి చేయనున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. దీని కోసం దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఐఏఎఫ్ చెప్పింది.