కొత్తగా పదోన్నతులు ఇవ్వలేని స్థితి
నిమ్మకు నీరెత్తినట్టున్న తెలంగాణ సర్కారు
రాష్ట్రంలో వైద్య విద్యా రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉండడమే ఇందుకు కారణం. దీనివల్ల యువ వైద్యుల్లో వృత్తి నైపుణ్యం లోపించడమే కాక.. వైద్య సీట్లలో కోత పడే ప్రమాదమూ పొంచి ఉంది. అనుభవజ్ఞుల కొరతతో రోగులకు సరైన వైద్య సహాయం అందే పరిస్థితీ లేకుండా పోయింది. వీటన్నిటికీతోడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఎంసీఐ అనుమతి పొందడంలోనూ ఇబ్బంది ఎదురవుతోంది.
ఉదాహరణకు.. సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు ఎంసీఐ అనుమతి రాలేదు. అక్కడ 22 మంది ప్రొఫెసర్లు ఉండాలి. కానీ, ఉన్నది ముగ్గురే. మిగతా 19 పోస్టులూ ఖాళీ. దీంతో ఎంసీఐ ఈ మధ్య పరిశీలనకు వచ్చినప్పుడు వేరే కళాశాలల నుంచి ప్రొఫెసర్లను అక్కడికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఏంసీఐ మళ్లీ తనిఖీకి రాబోతోంది. అప్పుడు కూడా కళాశాల యాజమాన్యం సినిమా ఫీట్లు చేయక తప్పని పరిస్థితి నెలకొంది.
నిజానికి ఈ ప్రొఫెసర్ల కొరత కేవలం ఒక్క తెలంగాణకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. కానీ, కేంద్ర ప్రభుత్వం, ఎంసీఐతోపాటు పలు రాష్ట్రాలు ఈ పరిస్థితి నుంచి బయటపడే చర్యలను ఇప్పటికే తీసుకున్నాయి. ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపు ద్వారా ఈ లోటును కొంత వరకు భర్తీ చేసుకోగలిగాయి. తెలంగాణలో కూడా దీనిపై తర్జనభర్జనలు జరిగినా ఆ దిశలో మాత్రం ఇంకా అడుగు పడలేదు.
ఎంబీబీఎస్ సీట్లపై ప్రభావం!
వైద్యరంగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆ తర్వాత ప్రొఫెసర్ పోస్టులు ఉంటాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిదేళ్ల అనుభవం తరువాత అసోసియేట్ ప్రొఫెసర్ అవుతారు. అసోసియేట్ ప్రొఫెసర్‌గా నాలుగేళ్లు చేసిన తరువాత ప్రొఫెసర్ హోదా వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు తగినంత మంది లేకపోతే నేరుగా నియామకం చేసుకోవచ్చు. ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ మాత్రం అలా కాదు. అనుభవంతోనే ఈ హోదా వస్తుంది.
ప్రస్తుతం తెలంగాణలో అసోసియేట్ ప్రొఫెసర్లకు.. ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చే అవకాశం లేదు. కారణం.. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అర్హులైన అసోసియేట్ ప్రొఫెసర్లందరికీ పదోన్నతి వచ్చేసింది. మిగిలింది ఇంకా కాలపరిమితి పూర్తికాని అసోసియేట్ ప్రొఫెసర్లే. ఒక ప్రొఫెసర్‌కు 30 ఎంబీబీఎస్, 3 పీజీ సీట్లు కేటాయిస్తారు. కానీ ఆ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల ఎంబీబీఎస్, పీజీ సీట్లతోపాటు సూపర్ స్పెషాలిటీ సీట్లను కోల్పోవలసి వస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
అన్ని చోట్లా అదే పరిస్థితి..
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 35 మంది ప్రొఫెసర్లకుగాను.. 12 మందే ఉన్నారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ వైద్య కళాశాలల్లోనూ 30 శాతం మేర ప్రొఫెసర్లు లేరు. మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 90 శాతం మంది ప్రొఫెసర్లు లేరు. ఆదిలాబాద్ రిమ్స్ (రాజీవ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో ప్రొఫెసర్ల కొరత 80 శాతానికి పైగానే ఉంది.
తెలంగాణలోనే తక్కువ..
అనుభవజ్ఞులైన వైద్యులతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు, వైద్యరంగ పటిష్ఠతకు కేంద్ర మంత్రివర్గం ప్రొఫెసర్ల వయోపరిమితిని 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ దీనికి ఆమోదముద్ర వేశారు. ఎంసీఐ అయితే వయోపరిమితి 70 ఏళ్ల వరకూ ఉండొచ్చని అభిప్రాయ పడింది. ఈమేరకు పలు రాష్ట్రాలు వయోపరిమితిని పెంచాయి. ఆ రాష్ట్రాలన్నింటి కంటే తెలంగాణలోనే తక్కువ వయోపరిమితి(58) ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కూడా వయోపరిమితి పెంచాలనే డిమాండ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది మే నెలలో వయోపరిమితి పెంపుపై ఉత్తర్వులు (జీవో 86) జారీ చేసింది.
తెలంగాణలో ఇలా.. మిగతా చోట్ల అలా..
వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణకు సంబంధించి.. దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణలోనే అతితక్కువ వయోపరిమితి ఉంది. కావాలంటే చూడండి..
తెలంగాణలో మోకీలు మార్పిడి సర్జరీలు 16.. ఏపీలో 517
బైపాస్ సర్జరీలు 26.. ఏపీలో 406
దేశంలోని చాలా రాష్ట్రాలతో పోలిస్తే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జరిగే సర్జరీలు తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నాయి. గత ఏడాది జనవరి-నవంబరు మధ్య తెలంగాణలోని బోధన ఆస్పత్రుల్లో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు (నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ) 16 జరిగితే.. ఆంధ్రప్రదేశ్‌లో 517 జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బైపాస్ సర్జరీ తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 26 మాత్రమే జరగ్గా ఆంధ్రప్రదేశ్‌లో 406 బైపాస్ సర్జరీలు జరిగినట్లు వెల్లడవుతోంది. అలాగే.. 2017 జనవరి-నవంబరు మధ్య తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో జరిన 26 బైపాస్ సర్జరీల్లో 14 మంది మరణించారు. అంటే.. మరణాల రేటు 53%. అదేసమయంలో ఏపీలో జరిగిన 406 బైపాస్ సర్జరీల్లో మృతుల సంఖ్య 16. అంటే 4 శాతం.