శ్రీకాకుళం, డిసెంబర్ 11,
సీఎం జగన్ తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశం.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తానని జగన్ ప్రకటించారు. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ప్రారంభించారు. ఇప్పటికే కమిటీలు వేశారు. కేబినెట్‌లోనూ చర్చించారు. మొత్తంగా ఒక వ్యూహం ప్రకారం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇంత వరకుబాగానే ఉంది. రాష్ట్రంలో ఇప్పుడున్న 13 జిల్లాలు 25 లేదా అరకును రెండు చేస్తే.. 26 జిల్లాలు ఏర్పడతాయి.అయితే.. ఇక్కడే అసలు సిసలు సమస్య అధికార పార్టీ నేతలను ఇరుకున పెడుతోంది. ఇప్పటికే ప్రస్తుతం ఉన్న చాలా జిల్లాల్లో మా ప్రాంతాన్ని జిల్లా చేయాలంటే.. మా ప్రాంతాన్ని జిల్లా చేయాలంటూ.. ఉద్యమాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల తమ ప్రాంతాలు / నియోజకవర్గాలకు కొత్త జిల్లాల్లో కలపవద్దని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా కేంద్రాల ఏర్పాటు కూడా తలనొప్పిగా మారింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికీ ఏమీ చెప్పలేక.. తాము ఏమీ చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇది చివరికి తమ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపుతుందేమో.. అని తర్జన భర్జన పడుతున్నారు. ఇలాంటి సమస్యే ఇప్పుడు శ్రీకాకుళంలోనూ వచ్చింది.వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాను విభజించి రెండు జిల్లాలు చేయొద్దని.. వైసీపీ నాయకులే కోరుతున్నారు. దీనివల్ల ఇప్పటికే వెనుకబడిన జిల్లా కాస్తా.. మరింత వెనుకబడుతుందని వారు అంటున్నారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పలు సందర్భాల్లో బహిరంగంగానే ప్రభుత్వాన్ని పరోక్షంగా విమర్శించారు. ఇక గుంటూరు, నెల్లూరు, మదనపల్లి లాంటి చోట్ల కూడా సొంత పార్టీ నేతల నుంచి ఇదే తరహా అభ్యంతరాలు జోరందుకున్నాయి. చివరకు జగన్ వార్నింగ్ ఇస్తే గాని వీరు వెనక్కు తగ్గలేదు.ఇదిలా వుంటే శ్రీకాకుళం జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గం పాలకొండలో మరో సరికొత్త డిమాండ్ ఊపందుకుంది. పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలంటూ.. ఇక్కడి ప్రజలు ఉద్యమిస్తున్నారు. తమను అరకు లేదా పార్వతీపురం జిల్లాల్లో కలిపితే సహించమని.. పాలకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమిస్తుండడంతో ఎమ్మెల్యే కళావతి ఇరుకున పడుతున్నారు. ఈ ఉద్యమంలో గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. వీళ్లకు టీడీపీ బలంగా సపోర్ట్ చేస్తోంది.ఇప్పటికే రెండుసార్లు వరుసగా గెలిచిన కళావతికి గిరిజనుల్లో మంచి పట్టుంది. ఎస్టీ వర్గంలో వైసీపీ ఆమె మంచి లీడర్‌గా ఎదిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే తాజా డిమాండ్‌తో ఆమె తన ఓటు బ్యాంకు ఎక్కడ చెల్లాచెదరవుతుందో ? అన్న ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే.. ఈ డిమాండ్ ఎలాగూ నెరవేరదు. పైగా ఎవరూ పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. దీంతో ఆమె ఈ విషయాన్ని తాజాగా జగన్‌కు వివరించాలని చూస్తున్నారు.