YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చివరి లక్ష్యాన్ని సాధించలేకపోయిన రావత్

చివరి లక్ష్యాన్ని సాధించలేకపోయిన రావత్

న్యూఢిల్లీ, డిసెంబర్ 11,
మిలటరీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ రక్షణ రంగంలో అతి పెద్ద సంస్కర్తగా పేరు గడించారు. భారత రక్షణ రంగంలో ఆయన త్రివిధ దళాల మధ్య సయోధ్య సాధించడం.. రక్షణ రంగాన్ని ఆధునికీకరించే గురుతర బాధ్యత కూడా బిపిన్ రావత్ తీసుకున్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే దాకా ఆయన భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంపైనే తీవ్రంగా కృషిచేశారు. దేశంలోని మూడు దళాలకు ఉన్న 17 కమాండ్లను ఒకే  తాటిపైకి తెచ్చి ఇంటిగ్రేటెడ్ కమాండ్లుగా చేసే కృషిలో బిపిన్ రావత్ నిమగ్నమై ఉన్నారు.ఇప్పటి వరకు ఆయా దళాలు దేనికదే అధికారాలు, హోదా అనుభవిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో కీలకంగా వ్యవహరించే ఒక బలగం కమాండ్ లో మిగతా  కమాండ్లను ఉంచే ప్రయత్నం చేస్తున్నారు బిపిన్ రావత్. దళాలను ఆధునికీకరించడం, హేతుబద్ధీకరణతో పాటు వనరులను, ఆయుధ సంపత్తిని గరిష్ట వినియోగానికి అనుకూలంగా మలిచే బాధ్యత బిపిన్ రావత్ తీసుకున్నారు. థియేటర్ కమాండ్స్  విషయంలో త్రివిధ దళాల్లో ప్రధానంగా వైమానిక దళంలో తీవ్ర అయిష్టత ఉందంటారు. అయినప్పటికీ.. ఇది ప్రధాని మోదీ అప్పగించిన బాధ్యత.. మీ అభ్యంతరాలను 2022 జూన్ లోగా చెప్పండి అంటూ తన ముసాయిదా నివేదికను త్రివిధ  దళాధిపతులకు బిపిన్ ఇచ్చారట. వచ్చే సంవత్సరం ఆగస్టు నాటికి దీన్ని ఒక కొలిక్కి తేవాలన్న దృఢ సంకల్పంతో బిపిన్ రావత్ కృషిచేస్తున్నారు. ఇప్పుడు ఆకస్మికంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన తన సంకల్పాన్ని  నెరవేర్చుకోకుండా అనంత లోకాలకు వెళ్లిపోవడం దురదృష్టం.నిజానికి భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కాలం నుంచే సీడీఎస్ ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. అయితే… త్రివిధ దళాల మధ్య విభేదాలకు దారితీస్తుందేమో అనే  భయంతో గత ప్రభుత్వాలు ఆ ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు సాహసం చేయలేదు. కాగా.. ప్రధాని మోదీ ప్రభుత్వం సీడీఎస్ ఏర్పాటుపై సానుకూల నిర్ణయం తీసుకోవడం వెనుక బిపిన్ రావత్ పై ఉన్న నమ్మకం కూడా ఓ కారణం అంటారు.బిపిన్  రావత్ ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. మనసులో మాను కఠినంగా వెల్లడించడం వల్ల పలుమార్లు బిపిన్ రావత్ విమర్శలకు కూడా గురయ్యారు. సైన్యాధిపతిగా ఉన్నప్పుడే బిపిన్ రావత్ పాలకపక్షం మనసెరిగి  మాట్లాడుతున్నారనే విమర్శలు వచ్చాయి. ఎన్నార్సీ, సీఏఏలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను రావత్ తప్పుపట్టారు. తర్వాత కశ్మీర్ లో రుళ్లు రువ్వే పిల్లలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణం అయ్యాయి. సైనికుడి  నుంచి మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారి వరకూ బిపిన్ రావత్ సఖ్యతగా ఉండి, వారిని ఉత్సాహపరిచేవారు.భారత త్రివిధ దళాలను మరింత బలోపేతం చేసి వాటిని మరింత ఆధునికీకరించి, వాటి మధ్య సమన్వయం సాధించే లక్ష్యంతో ఓ సరికొత్త  వ్యవస్త బిపిన్ రావత్ నాయకత్వంలో రూపొందుతోంది. ఇంతలోనే ఇంత ఘోరం జరిగిపోవడం విషాదకరం.

Related Posts