YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిరుపేద‌ల‌కు వ‌రం డ‌బుల్ బెడ్‌రూం ప‌థ‌కం జాతీయ ఎస్సీ క‌మీష‌న్ స‌భ్యులు రాములు

నిరుపేద‌ల‌కు వ‌రం డ‌బుల్ బెడ్‌రూం ప‌థ‌కం        జాతీయ ఎస్సీ క‌మీష‌న్ స‌భ్యులు రాములు

గ్రేట‌ర్ హైద‌రాబాద్ నిరుపేద‌ల‌కు నిర్మిస్తున్న డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల ప‌థ‌కం దేశంలో మ‌రెక్క‌డాలేద‌ని, ల‌క్ష‌లాది రూపాయ‌ల వ్య‌యంతో నిర్మిస్తున్న ఈ డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప‌థ‌కం గొప్పద‌ని జాతీయ షెడ్యూల్డ్ కులాల క‌మీష‌న్ స‌భ్యులు కె.రాములు ప్ర‌శంసించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా చేప‌ట్ట‌డాన్ని గుర్తించి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ధాన మంత్రి ఎక్స‌లెన్సీ అవార్డును కూడా జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్‌కు అందిజేసిన విష‌యాన్ని గుర్తుచేశారు. షెడ్యూల్డ్ కులాల‌కు జ‌రుగుతున్న ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాలు, ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం త‌దిత‌ర అంశాల‌పై నేడు జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో జీహెచ్ఎంసీ ఉన్న‌తాధికారులు, ఇంజ‌నీర్లు, జోన‌ల్, డిప్యూటి క‌మిష‌న‌ర్ల‌తో స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్లు భార‌తీ హోలీకేరి, శృతిఓజా, ర‌వికిర‌ణ్‌, శంక‌ర‌య్య‌, భాస్క‌రాచారి, చీఫ్ ఇంజ‌నీర్లు సురేష్‌, శ్రీ‌ధ‌ర్‌, జియాఉద్దీన్ త‌దిత‌రులు పాల్గొన్న ఈ స‌మావేశంలో జాతీయ ఎస్సీ క‌మీష‌న్ స‌భ్యులు కె. రాములు మాట్లాడుతూ హైద‌రాబాద్ న‌గ‌రంలోని బోజాగుట్ట లాంటి ఎన్నో మురికి వాడ‌ల్లో అతిత‌క్కువ స్థ‌లంలో గుడిసెల్లో ద‌య‌నీయ‌మైన జీవ‌నాన్ని పేద‌లు గ‌డిపారని, అలాంటి అభాగ్యుల‌కు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి ఇవ్వ‌డం అభినంద‌నీయ‌మ‌ని అన్నారు. స‌మాజంలోని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగ‌లు, బ‌ల‌హీన‌వ‌ర్గాల అభ్యున్న‌తికి ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌తో ప‌నిచేయాల‌ని అధికారుల‌ను కోరారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఉన్న క‌మ్యునిటీహాళ్ల‌ను పూర్తిస్థాయిలో నిరుపేద‌ల‌కు అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. జీహెచ్ఎంసీలో చేప‌డుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల నియామ‌కంలో రోస్ట‌ర్ విధానాన్ని త‌ప్ప‌నిస‌రిగా పాటించేలా చూడాల‌ని క‌మిష‌న‌ర్‌కు సూచించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో ఎంతో కాలంగా ఆవిష్క‌ర‌ణ‌కు నోచుకోని అంబేడ్క‌ర్‌, బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ విగ్‌చహాలను వెంట‌నే ఆవిష్క‌రించేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. బ‌ల్దియాలో ఉన్న‌తస్థాయి అధికారుల నియామ‌కం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ క్రింది స్థాయి ఉద్యోగుల నియామ‌కం త‌గు నిష్ప‌త్తిలో లేద‌ని, దీంతో క్రింది స్థాయి ఉద్యోగుల్లో ప‌నిభారం పెరిగి తీవ్ర ఒత్త‌డికి లోన‌వుతున్నార‌ని, ఈ విష‌యంలో క్రిందిస్థాయి ఉద్యోగుల నియామ‌కాల‌ను చేప‌ట్టాల‌ని రాములు క‌మిష‌న‌ర్‌కు సూచించారు. జీహెచ్ఎంసీలోని షెడ్యూల్డ్ కులాల ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ప్ర‌త్యేకంగా ఉన్న‌తాధికారుల‌తో కూడిన క‌మిటిని ఏర్పాటుచేసి స‌మావేశం నిర్వ‌హించాల‌ని సూచించారు. ఈ స‌మావేశంలో జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి మాట్లాడుతూ జీహెచ్ఎంసీలో ఔట్‌సోర్సింగ్ ప‌ద్ద‌తిలో చేప‌ట్టిన నియామ‌కాల‌న్నింటిలోనూ మొట్ట‌మొద‌టి సారిగా రోస్టర్‌, మెరీట్ ప‌ద్ద‌తిన చేప‌ట్టామ‌ని వివ‌రించారు. జీహెచ్ఎంసీలో ప‌నిచేస్తున్న పారిశుద్య కార్మికులంద‌రికీ ఇన్సూరెన్స్ విధానాన్ని క‌ల్పించామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఉద్యోగ సంఘాలు చేసిన డిమాండ్ల ప‌రిష్కారానికి చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్న‌ట్టు క‌మిష‌న‌ర్ స్ప‌ష్టం చేశారు. జాతీయ ఎస్సీ క‌మీష‌న్ స‌భ్యులు రాములును జీహెచ్ఎంసీలోని ఉద్యోగ సంఘాలు, అధికారులు ఘ‌నంగా స‌న్మానించారు.

Related Posts