YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రూపాయికే బట్టలు

రూపాయికే బట్టలు

బెంగళూర్, డిసెంబర్ 13,
సామాన్య ప్రజలపై కరోనా ఎంతటి దారుణమైన ప్రభావం చూపిందో మనందరికీ తెలిసిందే. కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి పనులు లేక ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు. కొందరు రోడ్డున పడితే.. మరికొందరు ఆర్థిక ఇబ్బందులను తాలలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా సమయంలో పేదల దుర్భర స్థితికి చలించిపోయిన నలుగురు స్నేహితులు.. సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కరోనా సమయంలో ఆర్థికంగా చితికిపోయిన పేదలకు దుస్తులు అందజేయాలని భావించారు. ఈ క్రమంలో కొత్తగా, భిన్నంగా ఆలోచించి.. ప్రజల నుంచి సేకరించిన దుస్తులతో పేదల కోసం ఏకంగా షాపింగ్‌మాల్‌నే ప్రారంభించారు. అయితే, ఈ దుస్తులు ఉచితంగా ఇవ్వరు. ఏ దుస్తులకైనా ఒక్క రూపాయి చెల్లించాల్సి ఉంటుంది. బెంగళూరుకు చెందిన నలుగురు స్నేహితులు కలిసి బెరటెనా అగ్రహారంలోని లవకుశ లేఅవుట్‌లో ‘ఇమాజిన్‌ క్లాత్‌ బ్యాంక్‌’ పేరుతో నిరుపేదల కోసం షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. వారు ఉంటున్న కాలనీ పరిసర ప్రాంతాల ప్రజల నుంచి దుస్తులను విరాళంగా తీసుకొని వాటిని శుభ్రం చేసి షాపింగ్‌మాల్‌లో విక్రయిస్తున్నారు. కేవలం ఆదివారాల్లో మాత్రమే తెరుచుకునే ఈ షాపింగ్‌మాల్‌లో మగ, ఆడవారికి పిల్లలకు, అన్ని వయసుల వారికి.. అన్ని రకాల దుస్తులు లభిస్తాయి. ఏ దుస్తులకైనా కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటారు. దీంతో పేదలకు కూడా నచ్చిన దుస్తులను ఎంపిక చేసుకొనే అవకాశం లభించినట్లే. గత సెప్టెంబర్‌లో ప్రారంభించిన షాపింగ్‌మాల్‌లో ఇప్పటి వరకు 150కిపైగా పేద కుటుంబాలు వచ్చి దుస్తులు కొనుగోలు చేశారు. ఒక వ్యక్తి ఒక్కసారి గరిష్ఠంగా పది దుస్తులను మాత్రమే కొనుగోలు చేయాలన్న నిబంధన విధించారు. ఈ సేవ ఇలాగే కొనసాగించాలంటే.. దాతలు ముందుకురావాలని కోరుతున్నారు ఇమాజిన్‌ నిర్వాహకులు.

Related Posts