పాలమూరు, డిసెంబర్ 13,
వార్దిదరూ అధికారపార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులే. కార్యకర్తలను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడపాల్సిన ఆనేతల మద్య కుమ్ములాటలు సాగుతున్నాయి.సొంత పార్టీ నేతల కుమ్ములాటలు నియోజకవర్గంలో మరో పార్టీకి అవకాశం ఇచ్చేలా ఉన్నాయంట.ఇక నేతల తీరుతో విసిగిపోతున్న క్రిందిస్దాయి నేతలు, కార్యకర్తలు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలుఆ పార్టీ అదిష్టానానికి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గాల్లోని నేతలు గ్రూపులుగా విడిపోయి… ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్సెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి మద్య వర్గపోరు నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలిపోయారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల నుంచే కొనసాగుతూ వస్తున్న అంతర్గత కుమ్ములాటలు ఇప్పుడు పీక్స కి చేరాయి.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మద్య ఉన్న గొడవలతో నియోజకవర్గంలోని క్యాడర్ రెండుగా చీలింది.నియోజకవర్గంపై పూర్తి స్థాయి పట్టు కోసం పావులు కదుపుతున్న ఈ నేతలిద్దరు వేదికలు పంచుకుంటూనే, వెనక గోతులు తవ్వుకుంటున్నారు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికలన్నట్లు తమ బలం పెంచుకునేందుకు రాజకీయాలు నడుపుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఎమ్మెల్సి కసిరెడ్డికి నిరాశే మిగిలింది. జైపాల్ యాదవ్ కు అధిష్టానం అవకాశం కల్పించింది. దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సిగా కొనసాగుతూ నియోజకవర్గంలో చాపకింద నీరులా తన అనుచర గణాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం కల్వకుర్తిలోని జడ్పీటీసిలు, ఎంపీపిలు, ఎంపిటీసిలు, సర్పంచులు సైతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలుగా వీడిపోయి కార్యక్రమాలు జరుపుకుంటున్నారు.పార్టీలో అసలు ఉద్యమకారులు పక్కకు పోయారు, ఇతర పార్టిల నుంచి వచ్చిన నేతలు తమ ప్రాబల్యాన్ని చూపించుకోవాలని పరితపిస్తున్నారని కల్వకుర్తి రాజకీయ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. ఆ మద్య ఆమనగల్లు మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ రైతుబందుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కాని సమావేశం విషయాన్ని తనకు ఇవ్వలేదని ఎంపీపీ అనిత రాథోడ్ అసంతప్తి వ్యక్తం చేసింది. తనకు తెలియకుండా తన చాంబర్‌లో సమావేశం ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగింది. ఇలా వర్గాలుగా స్థానిక ప్రజాప్రతినిధులు విడిపోవడంతో పార్టీ క్యాడర్‌లో గందరగోళం నెలకొంది.తాజాగా కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ నిర్వహించిన భారత్‌బంద్‌లో ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలు వేర్వేరుగా మొదట బంద్‌లో పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆమనగల్లులో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు.దీంతో ఇరువర్గాల మద్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఇక్కడ అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీ ఇద్దరిలో ఎవరో ఒకరు తామ పార్టీలోకి రాకపోతారా..ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకత తమకు కలిసిరాకపోతుందా అని లెక్కలేస్తున్నారు.