YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

భారీ ఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు

భారీ ఎత్తున  ఐఏఎస్‌, ఐపీఎస్‌ల బదిలీలు

హైదరాబాద్, డిసెంబర్ 13,
తెలంగాణ రాష్ట్రంలో భారీఎత్తున ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర ఉన్నతాధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నెల 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపుతో ఎన్నికల కోడ్‌ ముగియనుంది. ఆ వెంటనే ఉన్నతాధికారుల స్థానచలనాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా బదిలీల జాబితాలు సిద్ధమవుతున్నా.. వివిధ ఎన్నికలు, ఇతర కారణాలతో వాయిదా పడుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం బదిలీలు అనివార్యంగా భావిస్తున్న ప్రభుత్వం.. ఇందుకు అనుగుణంగా కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ, శాఖాపరమైన అవసరాలు, వారి నడవడిక ఇతర అన్ని అంశాల ప్రాతిపదికన బదిలీలు జరిగే అవకాశం ఉంది. కసరత్తులో భాగంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల పనితీరుపై నివేదికలు సిద్ధం చేసిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌.. వాటిని ముఖ్యమంత్రికి సమర్పించారు.అధికారులు ఎంత కాలం నుంచి ఆయా పోస్టుల్లో ఉన్నారు.. వారి పనితీరు ఏ విధంగా ఉంది తదితర వివరాల్ని ఆ నివేదికలలో పొందుపరిచారు. ఈ నెల 15 నుంచి దీనిపై సీఎంతో సీఎస్‌ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే పలు శాఖల్లో కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరికొంత మంది అదనపు బాధ్యతల్లో దీర్ఘకాలికంగా ఉన్నారు. పలువురు ఐఏఎస్‌లకు పదోన్నతులు వచ్చినా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. కొన్ని కలెక్టర్‌ పోస్టులు సైతం ఖాళీగా ఉండగా… ఇతర జిల్లాల అధికారులు అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయా చోట్ల కొత్త వారిని నియమించే అవకాశం ఉంది. మరోవైపు పోలీసు శాఖలోనూ సీనియర్‌ అధికారులు, కమిషనర్లు, ఎస్పీల బదిలీలు చాలా రోజులుగా వాయిదా పడుతున్నాయి. దీంతోపాటు పలు శాఖల్లోని గ్రూప్‌-1 స్థాయి అధికారులు అధిపతుల హోదాలో కొనసాగుతున్నారు. పనితీరు సరిగా లేని కొంత మందిని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారికి సంబంధించిన నివేదికలు సైతం ముఖ్యమంత్రి వద్దకు చేరాయి.

Related Posts