ముంబై, డిసెంబర్ 14,
ఏయిర్ హోస్టెస్…. విమాన ప్రయాణంలో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ప్రయాణికులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ, వారి అవసరాలను తీరుస్తుంటారు. విమానరంగంలో ఈ ఏయిర్ హోస్టెస్ ఉద్యోగానికి భారీ డిమాండ్ కూడా ఉంది. ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదే విధానాన్ని రైల్వే వ్యవస్థ కూడా తీసుకురానుంది. ఇకపై ట్రైన్ హోస్టెస్‌ను ప్రవేశపెట్టబోతోంది. మొట్ట మొదటగా ఈ హోస్టెస్ వ్యవస్థను ప్రీమియం రైళ్లలో అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, గతిమాన్ ఎక్స్‌ప్రెస్, తేజస్ ఎక్స్‌ప్రెస్, రాజధాని, దురంతో లాంటి రైళ్లలో ఈ విధానాన్ని అతి త్వరలోనే ప్రవేశపెట్టనున్నారు.శాఖకు సంబంధించిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ… ”అచ్చు విమాన సర్వీసుల్లో ఉన్నట్టుగానే రైల్వేలో కూడా రైల్వే హోస్టెస్‌ను ప్రవేశపెట్టబోతున్నాం. అయితే అందరూ మహిళలే ఉండకపోవచ్చు. ఈ ఉద్యోగంలో చేరిన వారు ప్రయాణికుల అవసరాలు, సహాయ సహకారాలు అందించడం, ఆహార పదార్థాలను అందించడం, ప్రయాణికుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించడం లాంటి పనులు చేస్తారు” అని ఆ అధికారి వెల్లడించారు. రైల్వే ఆధునికీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, అలాగే ప్రయాణికులకు మరింత సౌకర్యాలను కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి వచ్చామని ఆ అధికారి వెల్లడించారు. అయితే ఈ హోస్టెస్ సేవలు కేవలం ఉదయం పూట మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు ప్రకటించారు.