కాబూల్, డిసెంబర్ 14,
ఆర్థిక సంక్షభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్థాన్‌లో నిత్యావసరాలు, అత్యావసరాల ధరలు నింగిని చేరాయి. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అక్కడ ఆర్థిక సంక్షోభం ముదురుతూ వస్తున్నది. దాంతో నిత్యావసరాల ధరలు అంతకంతకే పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్కడి పేద ప్రజలు ఒకపూట తిని, ఒకపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. ఏ వస్తువు ధర అడుగబోయినా గుండె గుబేలుమంటున్నది.డాలర్‌తో పోల్చుకుంటే ఆప్ఘనిస్థానీ కరెన్సీ అయిన ఆఫ్ఘనీ విలువ రోజురోజుకు పతనమవుతుండటమే నిత్యావసరాల ధరలు పెరుగుతుండటానికి కారణమని కాబూల్‌లోని ఓ దుకాణం యజమాని సైఫుల్లా చెప్పారు. ఆఫ్ఘనీతో పోల్చితే డాలర్ విలువ వేగంగా పెరుగుతుండటమే దేశంలో నిత్యావసరాల ధరలు పెరుగడానికి కారణం. తాము ఏ వస్తువునైనా డాలర్లలో కొని, ఆఫ్ఘనీల్లో అమ్ముతామని.. అందుకే ఆ రెండు కరెన్సీల మధ్య వ్యత్యాసం పెరుగడం ధరల పెరుగుదలకు కారణమవుతున్నది అని సైఫుల్లా తెలిపారుప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో కిలో పిండి 2,400 ఆఫ్ఘనీలు పలుకుతున్నది. అదేవిధంగా 16 లీటర్ల నూనె 2,800 ఆఫ్ఘనీలు, 25 కిలోల బియ్యం 2,700 ఆఫ్ఘనీలుగా ఉన్నది. అంతంత ధరలు భరించలేక, పస్తులు ఉండలేక ఆఫ్ఘన్ ప్రజలు అవస్థలు పడుతున్నారు. కూలీనాలీ చేసి రోజుకు 100 ఆఫ్ఘనీలు ఆర్జించే పేదల సంపద వారి తిండికి కూడా సరిపోవడం లేదు. ఆప్ఘనిస్థాన్‌కు దిగుమతి అయ్యే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటితే.. అక్కడ విరివిగా పండే ఉల్లి ధర మాత్ర కేవలం 30 ఆప్ఘనీలు పలుకుతున్నది.