రాజమండ్రి డిసెంబర్ 14,
టిడ్కో గృహాల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభిం చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 2,62,216 గృహాల్లో దశలవారీగా లబ్ధిదారు లకు పంపిణీ చేసేందుకు అధికారయంత్రాంగం సిద్దమవుతోంది. 2022 మార్చి నాటికి 1.30లక్షల గృహాలను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. ఇందులో తొలి విడతగా సుమారు 40వేల గృహాలను డిసెంబరు చివరి నాటికి లబ్దిదారులకు అందించేందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తొలి విడతగా పంపిణీ చేయాలని భావిస్తున్న వాటిలో నెల్లూరులో 13వేల గృహాలు, కర్నూలులో 6వేలు, పశ్చిమగోదావరిలో 5వేలు, తూర్పుగోదావరిలో 6వేలు, గుంటూరులో మరో 6వేల గృహాలను పంపిణీకి సిద్ధం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో విడతలో మార్చిలో మరో 80వేల గృహాలను పంపిణీకి సిద్ధం చేసే యోచనలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంపిణీ చేయాలనుకునే గృహాలకు సంబంధించి మౌలిక వసతులు, విద్యుత్తు, మంచినీటి సౌకర్యం, రహదారులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖ, రెవెన్యూశాఖలతో టిడ్కో అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.టిడ్కో ఇళ్లకు బ్యాంకర్లు మార్టిగేజ్ మెలిక పెడుతుండటంతో అధికారులు ఎలా ఈ సమస్యను అధిగమించాలో తెలియక సతమతమవుతున్నారు. బ్యాంకర్లు గృహాలకు రుణ సదుపాయం కల్పించాలంటే ఆ ఇంటికి సంబంధించిన ఆస్తి ఆన్‌లైన్‌లో నమోదై ఉండాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పత్రాన్ని పొంది ఉండాలనేది బ్యాంకర్ల నిబంధన. ఇది ఇలా ఉంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంప గుత్తగా స్వల్ప కాలంలో రిజిస్ట్రేషన్స్ చేసేందుకు సాప్ట్‌వేర్ సహకరించదని, దీంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అనేక రిజిస్ట్రేషన్లు రొటీన్‌గా ఉంటున్నాయని సబ్ రిజిస్ట్రార్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ అధికారాలను గ్రామ సచివాలయ అడ్మిన్‌కు బదలాయించి వారి ద్వారా మ్యాన్యువల్ రిజిస్ట్రేషన్లు చేసి లబ్ధిదారులకు డాక్యుమెంట్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇళ్లకు మార్టిగేజ్‌ద్వారా రుణాలివ్వాలంటే తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో ఆ ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తయితేనే సాధ్యమవుతుందని లేని పక్షంలో రుణాలివ్వలేమని బ్యాంకర్లు చెబుతుండటంతో ప్రభుత్వం ఇబ్బంది పడింది. బ్యాంకర్లు పెడుతున్న మెలికను దృష్టిలో పెట్టుకుని సిఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జరిగిన రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) సమావేశంలో టిడ్కో ఇళ్లకు బ్యాంకులు చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే సమస్య పరిష్కారమవుతుందని బ్యాంకర్లను కోరారు. వారినుండి నిర్దిష్ట హామీ ఏమీ లభించిన దాఖలాల్లేవు.