విజయవాడ, డిసెంబర్ 14,
మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) పద్ధతిలో భూము లిచ్చిన రైతుల కు గత నాలుగేళ్లుగా కౌలు చెల్లింపులు జరగడం లేదు. మొదటి రెండేళ్లు మాత్రమే కౌలు చెల్లించిన ప్రభుత్వం ఆ తర్వాత చెల్లింపులను నిలిపివేసింది. 2015 ఆగస్టు 29న రాష్ట్ర ప్రభుత్వం మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను భూ సేకరణ, భూ సమీకరణ (పూలింగ్) పద్ధతుల్లో సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. మంగినపూడి, తపిశపూడి, కరగ్రహారం, గోపువానిపాలెంలో ఎకరానికి రూ.25 లక్షల చొప్పున చెల్లించి 600 ఎకరాలను కొనుగోలు చేసింది. పూలింగ్ పద్ధతిలో భూములిచ్చిన రైతులకు ఎకరానికి 1000 గజాలు అభివృద్ధి చేసిన భూములు, 250 కమర్షియల్ ప్లాట్లు ఇస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. పూలింగ్‌లో ఇచ్చిన భూములను రైతులకు అంగీకారం అయ్యేలా అభివృద్ధి చేసి ఇచ్చే వరకు లేదా 30 ఏళ్లపాటు ఎకరానికి రూ.30 వేల చొప్పున కౌలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో మంగినపూడి, తపిశపూడి, కరగ్రహారం, గోపువానిపాలెం గ్రామాలకు చెందిన 350 మంది రైతులు పూలింగ్ పద్ధతిలో 412 ఎకరాలను ఇచ్చారు. ఒప్పందం మేరకు ఈ రైతులకు 2016, 2017 సంవత్సరాల్లో నిర్దేశించిన మొత్తం కౌలును ప్రభుత్వం చెల్లించింది. అయితే ఆ తర్వాత నుంచి కౌలు చెల్లించలేదు. దీంతో రైతులకు ప్రభుత్వం మొత్తం రూ. 4 కోట్ల 94 లక్షల 40 వేల రూపాయల మేర కౌలు చెల్లింపులు బకాయి పడింది.పోర్టు నిర్మాణం, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు గత టిడిపి ప్రభుత్వం బందరు రూరల్ మండలంలో 32 వేల ఎకరాలు సేకరిస్తామని ప్రకటించింది. ఈ భూములకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీనికి వ్యతిరేకంగా సుదీర్ఘకాలం పాటు పెద్దఎత్తున ప్రజా ఉద్యమం సాగింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిదశలో 3,762 ఎకరాల్లో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక రూపొందింది. ప్రభుత్వ భూములు, భూ సేకరణ, సమీకరణలో సేకరించిన భూములు 2,328 ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. మరో 1434 ఎకరాలు సేకరించాలి. రెండున్నరేళ్లలో ఈ భూముల సేకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.