హైదరాబాద్, డిసెంబర్ 14,
తెలంగాణలో త్వరలో లిక్కర్ డోర్ డెలివరి కానుందా? మద్యం ప్రియులు కూడా అదే కోరుకుంటున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే మొదలైంది కూడా. అయితే లిక్కర్ డోర్ డెలివరీని ప్రస్తుతం ప్రభుత్వం అందించడం లేదు. మద్యం వ్యాపారులే మొదలు పెట్టేశారు. మద్యం ప్రియుల నుంచి డిమాండ్ వస్తుండటంతో లిక్కర్ ను వాళ్ల ఇంటి దగ్గరే అందించేందుకు ఏర్పాట్లు చేశారు. సూర్యాపేట జిల్లాలోని ఓ మద్యం షాపులో డోర్ డెలివరీని ప్రారంభించగా.. మంచి స్పందన వస్తుందని అంటున్నారు.నిజానికి తెలంగాణలో మద్యం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దక్షిణాదిలోని మిగితా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలోనే లిక్కర్ సేల్స్ ఎక్కువ. సర్కార్ కు ఎక్సైజ్ నుంచి వచ్చే ఆదాయమే ఎక్కువ. అందుకే తెలంగాణ సర్కార్ ప్రతి ఏటా మద్యం షాపులను పెంచుకుంటూ పోతుంది. డిసెంబర్ నెలలో మొదలైన కొత్త షాపుల టెండర్ల సమయంలోనూ మరో 4 వందలకు పైగా కొత్త షాపులను మంజూరు చేసింది. గతంలో ఒక్కో మండలానికి ఒక వైన్ షాపు ఉండగా... ఇప్పుడు రెండు, మూడు కూడా ఉన్నాయి. దీంతో మద్యం వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది. ఇది కూడా డోర్ డెలివరీకి అవకాశం ఇచ్చిందంటున్నారు. కస్టమర్స్ ను ఆకర్షించి తమ సెల్స్ పెంచటానికి ఇంటికే వచ్చే లిక్కర్ అందిస్తామని కొందరు వ్యాపారులు ఆఫర్లు పెట్టారని తెలుస్తోంది. ఇలా ఒకరిని చూసి మరొకరు డోర్ డెలివరీ సిస్టమ్ వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. కొందరు ఎక్స్ ట్రా డబ్బులు తీసుకుంటగా.. ఇంకొందరు మాత్రం ఫ్రీగానే డోర్ డెలివరీ చేస్తున్నారు. లిక్కర్ డోర్ డెలివరికి సంబంధించి గత సెప్టెంబర్ జరిగిన ఓ సర్వేలోనూ తెలంగాణకు సంబంధించి ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. ఇంటర్నేషనల్ స్పిరిట్ అండ్ వైన్స్ అసొసియేషన్ కస్టమర్ పల్స్ నిర్వహించిన సర్వేలో తెలంగాణలో వంద శాతం మంది డ్రింకర్లు డోర్ డెలివరీ కోరుకున్నారు. తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లో ఆ సంస్థ సర్వే జరపగా.. మిగితా ఏడు రాష్ట్రాల్లో 70 శాతం మంది ప్రజలు డోర్ డెలివరీకి మొగ్గు చూపారు. తెలంగాణకు సంబంధించి నిజామాబాద్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలో డోర్ డెలివరీకి సంబంధించి డిమాండ్ కనిపించింది. దాదాపు ఏడున్నర వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే చేసింది అయితే డోర్ డెలివరీకి సర్వీస్ చార్జీ విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సిటీ ప్రాంత ప్రజలు 50 నుంచి 100 రూపాయలు వసూల్ చేయవచ్చని చెప్పగా... మధ్య తరగతి ప్రజలు మాత్రం 5 నుంచి 10 రూపాయలు మాత్రమే డోర్ డెలివరీకి సర్వీస్ చార్జీ తీసుకోవాలని తమ అభిప్రాయం చెప్పినట్లు సర్వే వెల్లడించింది. తమ సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలను తెలంగాణ సర్కార్ కు నివేదిస్తామని సీఈవో కపూర్ చెప్పారు. ప్రభుత్వమే అధికారికంగా లిక్కర్ డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తామని చెప్పారు. మన దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ విధానం అమలులో ఉంది. కొవిడ్ సమయంలో పశ్చిమ బెంగాల్, చత్తీస్ గఢ్, అసొం, ఒడిషా, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, పుదిచ్చేరి రాష్ట్రాల్లో అమలు చేశారు. ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కూడా లిక్కర్ డోర్ డెలివరీని ప్రారంభిస్తే మంచిదనే సూచన వస్తోంది. కొవిడ్ రూల్స్ పాటిస్తూ డోర్ డెలివరీ చేస్తే లిక్కర్ షాపుల దగ్గర రద్దీని కూడా తగ్గించేవచ్చనే అభిప్రాయం వస్తోంది.