హైదరాబాద్, డిసెంబర్ 14,
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆదివారంతో రెండో పర్యాయం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేయడంతో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు సిద్ధమయ్యారు.డిసెంబరు 16న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియడంతో ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించేందుకు కేసీఆర్ పరిపాలనలో కఠిన నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు దృష్టిసారించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జనవరి సంక్రాంతి తర్వాత 2022లో పార్టీలో భారీ మార్పలు ఉండబోతున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. IAS, IPS అధికారుల పనితీరు ఆధారంగా వారి ట్రాన్స్‌ఫర్లు ఉండే అవకాశం ఉంది. దీంతోపాటే సంక్రాంతి తర్వాత క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ కూడా ఉండే అవకాశాలను కాదనలేం. ప్రభుత్వంలో 500 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి, పార్టీలో ధైర్యాన్ని పెంచాలని సీఎం భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.అయితే, 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు, 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు, 2019లో లోక్‌సభ ఎన్నికలు, 2019 అక్టోబర్‌లో హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, 2020 చివరిలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల కారణంగా ముఖ్యమంత్రి తన రెండో పర్యాయంలో అనేక సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, ఏప్రిల్ 2021లో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక, అక్టోబర్ 2021లో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు ఈ మధ్యే స్థానిక సంస్థల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.గత మూడేళ్లలో వరుస ఎన్నికల కారణంగా దశలవారీగా చాలా నెలల పాటు అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రారంభించే నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుపడ్డాయి. మార్చి 2019లో కోవిడ్ మొదటి వేవ్, ఏప్రిల్ 2020లో రెండవ వేవ్ వల్ల నెలల పాటు లాక్‌డౌన్‌లు, వ్యాపార పరిమితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ. 1 లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా.ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చింది ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణలో అన్ని ఎన్నికలు ముగిశాయి, టిఆర్ఎస్ ప్రభుత్వం మిగిలిన రెండేళ్ల పదవీకాలానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలని గులాబీ బాస్ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గత మూడేళ్లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో చిన్నపాటి ఎదురుదెబ్బలు తప్ప.. డిసెంబర్ 2018 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఉత్సాహంతోనే పార్టీలో కీలక మార్పులకు స్వీకారం చుట్టాలని కేసీఆర్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.