YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంధనిలో కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్

మంధనిలో కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్

కరీంనగర్, డిసెంబర్ 15,
 మా ఓట్లు మరో పార్టీకి లాభం చేకూరవద్దని భావించే క్యాంపు ఏర్పాటు చేసుకున్నాం. స్థానిక సంస్థల కోసం పోరాటం చేసే నాయకునిగా ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డికి, మా నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు ఇనుముల సతీష్ కే మా మద్దతు. మీడియాలో కొంతమంది తప్పుడు రాతలు రాస్తున్నారు అన్న రీతిలో సరిగ్గా వారం రోజుల కిందట మంథని కాంగ్రెస్ నాయకులు గోవా క్యాంపు నుంచి విడుదల చేసిన వీడియోల సారాంశం ఇది. జిల్లాలో స్పష్టమైన బలం లేకున్నా మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం వెనక ఆంతర్యం ఏంటీ అన్నదే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో క్యాంపులో ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓటర్లు తమపై అవాకులు చెవాకులు పేలుతున్నారన్న రీతిలో కౌంటర్ ఇచ్చారు. కానీ, తీరా ఎన్నికల ఫలితాలు మాత్రం వారి మాటలతో పొంతనలేకుండా ఉన్నాయి.మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 37 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎన్నికయ్యారు. వీరిలో కొంతమంది ప్రతిపాదించడంతో ఇదే నియోజకవర్గానికి చెందిన ఇద్దరు నామినేషన్ దాఖలు చేయగా ఒకరు విత్ డ్రా అయ్యారు. మరో అభ్యర్థి ఇనుముల సత్యనారాయణ మాత్రం బరిలో నిలిచారు. ఉన్నట్టుండి మంథని కాంగ్రెస్ నాయకులు క్యాంపు రాజకీయాలకు తెరలేపడం అందరిని విస్మయపరిచింది. విక్టరీ మార్క్ చేరుకునేందుకు అవసరమైన మెజార్టీ లేకున్నా ఒక్క మంథని నియోజకవర్గానికి చెందిన వారే క్యాంపు రాజకీయాలకు శ్రీకారం చుట్టడంతో అధికార పార్టీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తారా లేక మరేదైనా కారణమా అన్న చర్చ సాగింది. అంతేకాకుండా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వారి కోసం టీఆర్ఎస్ పార్టీలో కోవర్టు ఆపరేషన్ చేసి సక్సెస్ అవుతారా? అన్న డిస్కషన్ కూడా జరిగింది. మంథని నాయకులు మాత్రం తాము సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి, ఇనుముల సత్యనారాయణలకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించడంతో సంచలనం కల్గించింది. మాటకు కట్టుబడి ఉంటారని, తాము నమ్ముకున్న ఓటర్లు మాత్రం తమకు అండగా నిలుస్తారని ఇరువురు అభ్యర్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.మంగళవారం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదల కావడంతో ఇనుముల సత్యనారాయణ, సారబుడ్ల ప్రభాకర్ రెడ్డిలు షాక్‌కు గురయ్యారనే చెప్పాలి. బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసిన తరువాత తమకు ఎవరూ అండగా నిలబడలేదని మనస్థాపానికి గురయ్యారు. మంథని కాంగ్రెస్ నాయకుడు ఇనుముల సతీష్ కు ఒక్క ఓటు పడకపోగా, సైదాపూర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్‌కు 3 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తమకు అండగా నిలుస్తామని బాహాటంగానే మంథని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రకటించినా ఓటు వేసే సమయానికి మాత్రం మనసు మార్చుకున్నారని వేదన పడుతున్నారు. చివరి క్షణంలో మారిన సమీకరణాల వల్లే ఈ పరిస్థితి తయారైందని అనుకుంటున్నారు. కనీసం తమను ప్రతిపాదించిన వారు కూడా తమకు ఓటేయకపోవడం ఏంటా అని వారు మదనపడిపోతున్నారు. ఏది ఏమైనా మంథని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల మాటలకు చేతలకు పొంతన లేదని మాత్రం అభ్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts