ఖమ్మం, డిసెంబర్ 15,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాహాడ్ మండలం సారపక పట్టణంలోని గాంధీనగర్, భాస్కర్ నగర్ ఏరియాలోని సర్వే నెంబర్ 262లోని ప్రభుత్వ, అసైన్డ్‌మెంట్ భూములు కొంత మంది వ్యక్తుల ద్వారా కబ్జాలకు గురవుతున్న పట్టించుకున్న నాధుడే కరువయ్యారు. ఆ ప్రాంతంలోని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రోత్సాహంతోనే అసైన్డ్‌మెంట్ భూముల కబ్జా దందా జరుగుతోందని పట్టణ ప్రజలు చెబుతున్నారు. పట్టణంలోని గాంధీనగర్, భాస్కర్ నగర్ ప్రాంతంలో యథేచ్ఛగా అసైన్డ్‌మెంట్ భూముల క్రయవిక్రయాలు కొందరు రెవెన్యూ సిబ్బంది కనుసన్నల్లోనే జరుగుతుండటం గమనార్హం.పేదప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డబ్బు ఆశ చూపి విలువైన అసైన్డ్‌మెంట్ భూములను తమ వశం చేసుకుని కోట్ల రూపాయలకు అమ్మకాలు సాగిస్తూ కొత్త దందాకు తెరలేపారు.పీవోటీ చట్టానికి విరుద్ధంగా రెవెన్యూ అధికారులు సైతం అసైన్డ్‌మెంట్ భూముల క్రయవిక్రయాలకు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆ శాఖలోని సిబ్బంది ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో గాంధీనగర్, భాస్కర్ నగర్ పట్టణానికి వెళ్లి చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వం పీవోటీ(ప్రొజీషియన్ ఆఫ్ ట్రాన్స్‌ఫర్)చట్టాన్ని తెరపైకి తెచ్చినా అసైన్డ్‌మెంట్ భూముల కబ్జాలు మాత్రం ఆగడం లేదు. అసైన్డ్‌మెంట్ భూముల క్రయవిక్రయాలు చేయొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయినా నిరుపేదలకు కేటాయించిన అసైన్డ్ మెంట్ భూముల క్రయవిక్రయాలు ఆగడం లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం ఏటా కోట్లు గడిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది సహకారంతోనే ఈ అక్రమ దందా సాగుతోందని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. అసైన్డ్‌మెంట్ భూములను ప్లాట్లుగా మార్చడంతో అవి పెద్దఎత్తున చేతులు మారుతున్నాయి. కాసులకు కక్కుర్తిపడి కొందరు రెవెన్యూ సిబ్బంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై భూ దందా చేస్తున్నట్టు తెలుస్తోంది. సారపక పట్టణంలోని సర్వే నెంబర్ 262 రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి అసైన్డ్ ల్యాండ్స్‌ను ప్లాట్లుగా చేసి అమ్మడమే ఇందుకు నిదర్శనం.సారపక పట్టణంలో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే నెంబర్ 262 అసైన్డ్‌మెంట్ భూములను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి కోట్ల రూపాయలకు అమ్ముతున్నారని పట్టణంలోని కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించి పిటీషన్ వేస్తున్నారంటూ మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది.రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తుంటే అసైన్డ్‌మెంట్ భూములను ఎవరు కాపాడుతారని పట్టణంలో కొందరు వ్యక్తులు ప్రశ్నిస్తున్నారు. అసైన్డ్‌మెంట్ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులను కోర్టు ముందు నిలబెడతామని కొందరు సవాల్ విసిరారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి గాంధీనగర్ భాస్కర్ నగర్ ఏరియాలోని సర్వేనెంబర్ 262లో గల అసైన్డ్‌మెంట్ భూములను ప్లాట్లుగా చేసి అమ్ముతున్న వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.