కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. శనివారం పోలింగ్ జరగనుంది. కర్ణాటక రాజకీయాలు మరింత ఆసక్తిదాయకంగా మారాయి. ఎలాగూ హంగ్ తరహా పరిస్థితులు తప్పవని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరు ఎవరితో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం అవుతోంది. ఈ నేపథ్యంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.ఇందులో ముఖ్యమైనది బీజేపీ, జేడీఎస్‌లు కలిసి కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఒప్పందానికి వచ్చాయనేది. ఇది వరకూ ఒకసారి ఈ రెండు పార్టీలూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే అప్పట్లో జేడీఎస్ నేత కుమారస్వామి బీజేపీకి గట్టి ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి సీటును ఇరు పార్టీలూ 20-20 నెలల పాటు పంచుకోగా.. తన టర్మ్ పూర్తి కాగానే బీజేపీకి హ్యాండిచ్చారు కుమారస్వామి. ఆ చేదు అనుభవం ఉన్నా, మరోసారి జేడీఎస్‌తో చేతులు కలపడానికే బీజేపీకి ముందుకు వెళ్తోందని అంటున్నారు. ఇప్పుడు అంతకు మించిన మార్గం లేదని కమలనాథులు అనుకుంటున్నారట. కర్ణాటక సీఎం పదవిని బీజేపీ నేతకే ఇవ్వాలనే షరతుతో జేడీఎస్‌తో బీజేపీ చేతులు కలపనుందని అక్కడి రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఇందుకు ప్రతిగా జేడీఎస్‌కు ఉపముఖ్యమంత్రి పదవిని ఇవ్వనుందట బీజేపీ. అలాగే జేడీఎస్ నేత కుమారస్వామికి కేంద్రంలో మంత్రి పదవిని కూడా ఇవ్వనున్నారట. దేవేగౌడ కుమారుల్లో ఒకరైన రేవణ్ణకు ఉపముఖ్యమంత్రి పదవి, కుమారస్వామికి కేంద్రమంత్రి పదవిని ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. సీఎం సీటును మాత్రం బీజేపీకి వదలాలి అనేది కమలనాథుల ప్రతిపాదన అని సమాచారం. దీనికి జేడీఎస్ కూడా సమ్మతించిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ప్రచారం మాత్రమే. ఈ ప్రచారంపై బీజేపీ, జేడీఎస్ నేతలెవరూ స్పందించడం లేదు. సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీల నేతలు