విజయవాడ, డిసెంబర్ 15,
వాళ్లంతా ఏపీలోని కీలక ఆలయానికి చెందిన పాలకవర్గ సభ్యులు. పైగా అధికారపార్టీ నేతలు. సమావేశాల్లో దున్నేయొచ్చని.. కనుసైగలతో శాసించొచ్చని ఎన్నో లెక్కలు వేసుకున్నారట. కానీ.. టీ.. కాఫీలకే పరిమితమై ఉస్సూరుమంటున్నారు. ఇంతకీ ఏంటా ఆలయం.. ఎవరా పాలకవర్గ సభ్యులు?బెజవాడ ఇంద్రకీలాద్రి. ఏపీలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే కనకదుర్గమ్మ గుడిలో.. గతంలో వివాదాలు అదేస్థాయిలో ఉండేవి. ఈ ఆలయానికి 15 మంది పాలకవర్గ సభ్యులు ఉన్నారు. పైలా స్వామినాయుడు ఛైర్మన్. ఆలయంలో ఎదురయ్యే సమస్యలను.. అక్కడ గుర్తించిన లోపాలను భక్తులు తమకు అందుబాటులో ఉండే పాలకవర్గ సభ్యులకు చెబుతుంటారు. అధికారులకు చెబితే సమస్యలపై దృష్టి పెడతారో లేదో అన్న అనుమానం వాళ్లది. భక్తుల ఆలోచన ఎలా ఉన్నా.. పాలకవర్గ సభ్యులను గుడిలో అస్సలు పట్టించుకోవడం లేదట. అంతా వెళ్లి ఈవో భ్రమరాంబకు మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉందట.దుర్గగుడిలో ఏ పనిచెయ్యాలన్నా.. ఈవో చెబితేనే చేస్తారని టాక్. ట్రస్ట్‌బోర్డు ఛైర్మన్ పైలా స్వామినాయుడు మాటను సైతం ఎవరూ పట్టించుకోవడం లేదట. చివరకు బోర్డు సమావేశంలో సభ్యులు చేసిన సూచనలు లెక్క చేయడం లేదని చెబుతున్నారు. బాత్రూమ్‌లు క్లీన్ చేయాలన్నా ఈవోనే చెప్పాలట. ఆలయ ప్రాంగణంలో సూచికల బోర్డులు పెట్టాలని ఎప్పుడో దసరా ఉత్సవాల్లో చెబితే.. ఇంత వరకు అతీగతీ లేదని సమాచారం. ఘాట్‌రోడ్డు, మహామండపం వైపు ఉన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పి 3 నెలలైనా.. పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదట. దీంతో ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు ఉన్న విలువ పాలకమండలికి లేదా అని సభ్యులు గొగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది.ఆలయంలో జరిగే అభివృద్ధి పనులు.. టెండర్ల విషయాలు పాలకమండలికి చెప్పడం లేదట. ఒకవేళ సభ్యులు చొరవ తీసుకుని అధికారుల దగ్గరకు వెళ్లి ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయవాడ రాజరాజేశ్వరిపేటలో దేవస్థానం భూమి కబ్జా అవుతోందని విజిలెన్స్ విభాగానికి బోర్డు సభ్యులు చెప్పినా చర్యలు తీసుకోలేదట. పాలకమండలి సమావేశాల సమయంలో తప్ప తమ ఊసే ఉండటం లేదని వాపోతున్నారట బోర్డు సభ్యులు. మీటింగ్‌కు రావడం.. టీ.. కాఫీలు తాగి వెళ్లడం తప్ప మరో పని లేదట. ప్రస్తుత పాలకమండలి పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. ఆ కారణమో ఏమో.. బోర్డులో ఛైర్మన్ సహా ఎవరినీ పట్టించుకోవడం లేదని ప్రచారం జరుగుతోంది. ఈ అనుమానంతోనే సభ్యులంతా కలిసి ఈవో దగ్గరకు వెళ్లి తమ గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది. తమ అవసరం ఉన్నా లేకపోయినా.. పదవీకాలంలో ఉన్నంత వరకు తమ సూచనలు.. సలహాలు పాటించాలని.. కనీస గౌరవం ఇవ్వాలని వేడుకున్నారట. ప్రస్తుతం ఆలయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్. మరి.. అసలు సంగతేంటో ఆ అమ్మవారికే తెలియాలి