YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

మున్సిపల్ స్కూళ్ల కష్టాలు ఇంతింత కాదయా

మున్సిపల్ స్కూళ్ల కష్టాలు ఇంతింత కాదయా

గుంటూరు, డిసెంబర్ 15,
మున్సిపల్‌ విద్యలో 3,4,5 తరగతులను హైస్కూళ్లకు తరలించడం వల్ల గదుల కొరత తీవ్రంగా ఏర్పడింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలల్లో కూడా 3,4,5 తరగతులను హైస్కూళ్లకు తరలించడం ప్రారంభమైంది. తరగతుల తరలింపు వల్ల రాష్ట్రవ్యాప్తంగా 1,200 గదులు హైస్కూళ్లలో అదనంగా నిర్మించాల్సి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నిర్మాణానికి అవసరమైన ఖాళీ స్థలాలు హైస్కూళ్లలో లేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు భోజనం చేసేందుకు, వారికి సరిపడ మరుగుదొడ్ల నిర్మాణానికే స్థలాలు లేవని, ఇప్పుడు గదుల నిర్మాణం ఎలా చేపట్టాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు. మరోవైపు టీచర్ల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల్లో 2,100 మంది టీచర్ల కొరత ఉందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలో ఉన్న 2,115 మున్సిపల్‌ పాఠశాలల్లో 3,380,47 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 2లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో 3,4,5 తరగతులు చదివే విద్యార్థులు సుమారు లక్ష మంది ఉంటారు. వీరిని ఇప్పుడు హైస్కూళ్లకు అధికారులు తరలిస్తున్నారు. గుంటూరు నగరంలో గుజ్జనగుళ్లలోని ప్రాథమిక పాఠశాలలోని 165 మంది 3,4,5 తరగతుల విద్యార్థులను పక్కనే ఉన్న ఎస్‌ఆర్‌ఆర్‌ హైస్కూల్‌కు తరలించారు. ఇప్పటికే ఉన్న విద్యార్థుల కోసం 4 అదనపు గదులు అవసరం. ఇప్పుడు తరగతుల తరలించడం వల్ల అదనంగా మరో 4 గదులు నిర్మించాల్సి ఉంటుంది. అయితే నిర్మించేందుకు అవసరమైన ఖాళీ స్థలం లేదు. ఇదే జిల్లా మంగళగిరి పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో ఉన్న మున్సిపల్‌ హైస్కూల్‌లో 1,050 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ పాఠశాలకు రోడ్డుకు అవతల వైపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 350 మంది 3,4,5 తరగతుల విద్యార్థులు చదువుతున్నారు. ఈ హైస్కూల్‌లో 20 తరగతి గదులు ఉన్నా విద్యార్థులకు చాలని పరిస్థితి ఉంది. ఇప్పుడు తరలింపు ప్రక్రియ వల్ల మరో 20 గదులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఇదే స్కూల్‌లో ఉపాధ్యాయుల కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. 30 మంది ఉపాధ్యాయులు అవసరం ఉండగా కేవలం 9 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. విద్యా వలంటీర్లు 12 మంది పనిచేస్తున్నారు. విజయవాడలోని గవర్నర్‌ పేటలోని మున్సిపల్‌ హైస్కూల్‌లో ఉన్న విద్యార్థులకే సరిపడ తరగతి గదులు లేక వరండాలో తరగతులు బోధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలను తరలించేందుకు అధికారులు మ్యాపింగ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ హైస్కూళ్ల్లలో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా గదులు నిర్మించకుండా తరలిస్తే ఇరుకు గదుల్లోనే బోధించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.

Related Posts