ఎన్టీఆర్ స్టేడియంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అతిపెద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1857 మే 10న తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ...హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 'వైబ్రంట్స్ ఆఫ్ కలాం' సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సదరు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు...1947 జూలై 22న జాతీయ జెండాకు జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోని సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. సర్వేపల్లి రాధాకృ ష్ణ చెప్పినట్లు.. జాతీయ జెండా ఏ ఒక్క పార్టీకో, మతానికో చెందింది కాదని, ఇది అందరిదని పవన్ అన్నారు. జాతీయ జెండాకు కులం, మతం, ప్రాంతం లేదన్నారు. జెండాలోని రంగులు జాతీయ సమైక్యతకు నిదర్శనమన్నారు. జాతీయ జెండాను చూసినప్పుడల్లా ఉవ్వెత్తున ఎగిసిపడే గుండె ధైర్యం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఆత్మస్థైర్యం రెపరెపలాడుతోందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. "ప్రకృతికి నష్టం కలగకుండా, దేశ ప్రజలయందు సోదర భావంతో ఉంటానని, దేశ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని" పవన్ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం భారత్ మాతాకీ జై, జైహింద్ అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.