న్యూ ఢిల్లీ
ఖగోళ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. చరిత్రలో తొలిసారి ఓ అంతరిక్షనౌక సూర్యుడిని తాకింది. నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్.. సూర్యుడి ఉపరితల వాతావరణంలోకి ప్రవేశించింది. కరోనాగా పిలువడే ఆ వాతావరణంలో పార్కర్ అంతరిక్ష నౌక అక్కడి శ్యాంపిళ్లను సేకరించింది. సూర్యుడి బాహ్య వాతావరణంలో ఉన్న అయస్కాంత శక్తిని కూడా అది అధ్యయనం చేసింది. సౌర శాస్త్రంలో ఇదో మైలురాయి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడిపై ల్యాండ్ కావడం వల్ల ఆ గ్రహాన్ని ఎలా అధ్యయనం చేయగలిగామో.. ఇప్పుడు సూర్యుడి చెంతకు వెళ్లడం వల్ల కూడా ఆ నక్షత్రాన్ని అర్థం చేసుకునే వీలు అవుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. పార్కర్ సోలార్ ప్రోబ్ మెషీన్ సూర్యుడిని తాకడం ఓ అసాధారణ ఘటన అని మిషన్ డైరక్టర్ థామస్ జుర్‌బుచెన్ తెలిపారు. సూర్యుడి నుంచి వెలుబడే సౌర తరంగాలపై పార్కర్ ప్రోబ్ మరింత లోతుగా అధ్యయనం చేయనున్నది. సూర్యుడి ఉపరితలం కరోనాలో భ్రమిస్తున్న పార్కర్ ప్రోబ్ వల్ల మునుముందు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని ప్రాజెక్టు సైంటిస్టు నౌరు రౌఫీ తెలిపారు. పార్కర్ సోలార్ ప్రోబ్‌ను 2018లో లాంచ్ చేశారు. సూర్యుడి రహస్యాలను స్టడీ చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. గతంలో ఏ స్పేస్‌క్రాఫ్ట్ కూడా సూర్యడి దగ్గరకు వెళ్లని రీతిలో దీన్ని ప్రయోగించారు. మూడు సంవత్సరాల తర్వాత పార్కర్ తన గమ్యస్థానానికి చేరుకున్నట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.భూమి తరహాలో సూర్యుడు ఘన పదార్ధం కాదు. భగభగ మండే ద్రవరూపంలో సూర్యుడి వాతావరణం ఉంటుంది. అయస్కాంత శక్తి, గురుత్వాకర్షణ వల్ల సూర్యుడిలోని ప్లాస్మా గట్టిగా ఉంటుంది. అయితే ఒక దగ్గర గ్రావిటీ, మ్యాగ్నటిక్ ఫీల్డ్‌లు చాలా బలహీనం అవుతాయి. ఆ ప్రాంతాన్ని ఆల్ఫ్‌వెన్ సర్ఫేస్ అంటారు. ఆ ప్రాంతాన్ని 2021, ఏప్రిల్ 28వ తేదీన పార్కర్ సోలార్ ప్రోబ్ టచ్ చేసినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.