హైదరాబాద్ డిసెంబర్ 15
ఎవరు అవునన్నా.. కాదన్నా సౌత్ మీద చిన్నచూపు చూస్తారన్న దానిపై ఎవరికి ఎలాంటి భేధాభిప్రాయం లేదు. అయితే.. ఇలాంటి తీరు జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మార్చటానికి అనుసరించాల్సిన విధానం వేరుగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. పక్క మోడీ లాంటి బలమైన నేతను ఢీ కొట్టటానికి.. సౌత్ లాంటి సాగదీత మాటలతో అయ్యేనా? అన్నది అసలు ప్రశ్న. తాజాగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దక్షిణాది రాష్ట్రాల్ని చిన్నచూపు చూస్తున్న వైనాన్ని ప్రస్తావించినట్లుగా వార్తలు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో కూటమి కట్టాలి.. అది కూడా మోడీకి వ్యతిరేకంగా అన్న వేళలో.. సౌత్ లాంటి మాటల్ని తెర మీదకు తీసుకొస్తే లాభం కంటే నష్టమే ఎక్కువన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంలోని మోడీ సర్కారును గద్దె దించటం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాంతీయ బేధాల్ని పక్కన పెట్టేయాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేసి.. అందుకు అతీతంగా అధికార క్షేత్రాన్ని సమంగా పంచుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కేంద్రంలోని మోడీ సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పాలంటే.. అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైన అంశం ఎజెండా కావాలే తప్పించి.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుంది. ఓపక్క మమత.. మరోపక్క కేసీఆర్ లాంటి నేతలు.. ఎవరికి వారు వారి రాజకీయ ఎజెండానే ముందుకు పెడుతుంటారు. అలాంటప్పుడు భిన్న ధ్రువాలు కలవటం అంత తేలికైన విషయం కాదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో భేటీ సందర్భంగా వ్యవసాయం.. రైతులు.. కేంద్ర.. రాష్ట్ర సంబంధాలు.. నిధుల పంపిణీ లాంటి కామన్ అంశాల్ని తెర మీదకు తీసుకురావాలి. అందుకు భిన్నంగా.. సౌత్.. నార్త్ అన్న మాటలు వస్తే జట్టు కట్టే విషయంలోనే తేడా కొట్టేసే అవకాశం ఉంది. రాజకీయ అనుభవం.. విషయాల్ని సునిశితంగా చూసే శక్తి ఉన్న కేసీఆర్ లాంటి అధినేత.. ఇలాంటి కీలకమైన పాయింట్లు మర్చిపోవటం ఏమిటి? మోడీకి షాకు ఇవ్వాలంటే.. దానికి తగ్గట్లు ప్లాన్ ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని కేసీఆర్ మర్చిపోకుంటే మంచిది.