YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుంటూరు స్వపక్షంలో విపక్షం

గుంటూరు స్వపక్షంలో విపక్షం

గుంటూరు, డిసెంబర్ 16,
గుంటూరు జిల్లా వైసీపీలో.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెట్టేశారు అధికారపార్టీ ఎమ్మెల్యేలు. స్వపక్షంలో విపక్షంగా మారి చర్చల్లోకి వచ్చారు. మంత్రి, ఎమ్మెల్యేలు మీటింగ్‌కు వచ్చినా.. కలెక్టర్‌, జేసీలు రాకపోవడం అనుమానాలకు కారణమై.. కొత్త చర్చకు దారితీసింది. ఎందుకిలా? గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలుంటే.. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది 15. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలలో మద్దాలి గిరి.. వైసీపీకి జై కొట్టేశారు. దాంతో అధికారపార్టీ బలం పదహారుకు పెరిగింది. ఈ జాబితాలో సీనియర్‌ ఎమ్మెల్యేలకు.. విపక్షాలపై విరుచుకుపడేవాళ్లకు కొదవ లేదు. కాకపోతే.. ఎమ్మెల్యేలకు బొత్తిగా స్ట్రాటజీ లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాళ్ల పరువు వాళ్లే తీసేసుకుంటున్నారు. ప్రభుత్వానికి మాట రాకుండా కాపుకాయడం సంగతి దేవుడెరుగు.. రక్షించాల్సిన వాళ్లే తమ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పరిస్థితి తెస్తున్నారు. ఇటీవల జరిగిన గుంటూరు జిల్లా పరిషత్‌ సమావేశం చూసినవాళ్లకు కలిగే అనుమానం ఇదే.సమావేశంలో ప్రతిపక్షం లేకపోతే బాగోదని అనుకున్నారో ఏమో.. వైసీపీ ఎమ్మెల్యేలే ఆ పాత్ర పోషించారు. అసెంబ్లీ స్థాయిలో మాట్లాడాల్సిన అంశాలను జడ్పీ మీటింగ్‌లో ప్రస్తావించి ఆశ్చర్య పరిచారు ఓ ఎమ్మెల్యే. నీళ్లు.. రూరల్‌ రోడ్ల సమస్యలు ప్రస్తావించాల్సిన చోట.. తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ ఏవేవో.. మాట్లాడటం.. ఆ ఎమ్మెల్యేకి మామూలైందట. గుంటూరు జిల్లాలో మిర్చి ప్రధాన పంట. ప్రస్తుతం పంటకు తామర తెగులు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వాలని జడ్పీ మీటింగ్‌లో బలవంతంగా రాష్ట్రంలో లక్షా 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నదని.. అందరికీ పరిహారం ఇచ్చినట్టు అవుతుందని తీర్మానం చేయించారు ఎమ్మెల్యేలు. అప్పటికే అధికారులు వారిస్తున్నా.. ఎమ్మెల్యేలు వినలేదట. ఆ సమావేశానికి వచ్చిన ఎంపి ఒకరు వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పారట. జడ్పీ మీటింగ్‌లో తీర్మానం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని కమిషనర్‌ చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రమంతా ఇదే పద్ధతిలో సర్కార్‌పై ఒత్తిడి పెంచుతారని వెల్లడించారట. కానీ.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జడ్పీ సమావేశంలో అత్యుత్సాహం చూపించారట.ఇదే కాదు.. జడ్పీ మీటింగ్‌కు మంత్రి మేకతోటి సుచరిత.. ఎమ్మెల్యేలు వస్తే.. జిల్లా కలెక్టర్‌ డుమ్మా కొట్టేశారు. వేరే పని ఉందని వెళ్లిపోయారు. జాయింట్‌ కలెక్టర్‌ను పిలిస్తే.. కరోనా లక్షణాల పేరు చెప్పి మీటింగ్‌ ఛాయలకు రాలేదు. మరో ఇద్దరు జేసీలు ఉన్నా.. వారికి మీటింగ్‌ సమాచారమే లేదట. మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే.. కిందిస్థాయి అధికారులే జడ్పీ మీటింగ్‌లో కనిపించారు. కలెక్టర్‌, జేసీ ఎందుకు రాలేదో..మీటింగ్‌కు వచ్చిన ప్రజాప్రతినిధులకు తెలుసు. అయినప్పటికీ మీటింగ్‌ సమాచారం ఉండి కూడా పైఅధికారులు రాకపోవడం బాధాకరమని కామెంట్‌ పాస్‌ చేశారు హోంమంత్రి. ఈ స్టేట్‌మెంట్‌ బయటకు రాంగ్ సిగ్నల్‌ పంపింది. మంత్రులు.. ఎమ్మెల్యేలను అధికారులు లైట్‌ తీసుకున్నారా.. లెక్క చేయడం లేదా అని చెవులు కొరుక్కున్నారు. అధికారులు మీటింగ్‌కు ఎందుకు రాలేదో చెబితే సరిపోయేది. కానీ.. వాళ్లు పిలిచినా రాలేదన్న సంకేతాలు బయటకు వెళ్లిపోయాయి.ఈ సమాచార లోపంపై మరో చర్చ కూడా జరుగుతోంది. జడ్పీ మీటింగ్‌లో మిర్చిపంటను, ఇతర సమస్యలను అధికారపార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తావిస్తారని తెలిసే.. ఉన్నతాధికారులు రాలేదని చెబుతున్నారు. పంట నష్టం వివరాలు సమర్పిస్తే.. దానికి పరిహారం ఇచ్చే స్థితిలో ప్రభుత్వం ఉందా.. లేదా..? ఎందుకొచ్చిన గొడవ అనుకొని వ్యూహాత్మకంగా గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇవేమీ పట్టించుకోని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు.. మిర్చి పంట నష్టంపై అంచనాలు వేసేసి.. పరిహారం ఇవ్వాల్సిందేనని జడ్పీ మీటింగ్‌లో తీర్మానం చేసేసి ప్రభుత్వానికి పంపించేశారు. దాన్ని కనుక ప్రతిపక్షం పట్టుకుని పరిహారం ఏది? ఎక్కడా? అని అంటే ఇరకాటంలో పడేది సర్కారే. అంతేకాదు కంటి తుడుపు చర్యగా.. మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలను వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెనకా ముందు ఆలోచించకుండా ఏదంటే అది మాట్లాడి సెల్ఫ్‌గోల్‌ వేసుకుంటున్నారని.. ఎమ్మెల్యేలకు బొత్తిగా స్ట్రాటజీ లేకుండా పోయిందనే కామెంట్స్‌ జోరందుకున్నాయి.

Related Posts