YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రి పదవి కోసం రమణ ఆశలు

మంత్రి పదవి కోసం రమణ ఆశలు

కరీంనగర్, డిసెంబర్ 16,
కొత్తగా మండలిలో అడుగుపెట్టనున్న ఎల్.రమణ మరో రికార్డును అందుకుంటారా..? కేబినెట్‌లో చోటు దక్కుతుందా? అన్న చర్చ ఆయన అనుచరుల్లో సాగుతోంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన తరువాత కేబినెట్‌లో బెర్త్ ఖాయం చేసుకున్న రమణ ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఆ రికార్డును అందుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.1994 ఎన్నికల్లో అనూహ్యంగా ఎల్.రమణ పేరు జగిత్యాల తెరపైకి వచ్చింది. టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆయన విధాన సభలోకి అడుగు పెట్టారు. అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో NT రామారావును గద్దె దించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు కేబినెట్‌లో టైక్స్ టైల్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 18 నెలలకు జరిగిన లోకసభ ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఎంపీగా గెలిచి లోకసభకు వెళ్లారు. 1998 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయిన ఆయన ఆ తరువాత జరిగిన వరుస ఎన్నికలు ఆయనకు సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు. 2009లో మరోసారి జగిత్యాల నుండి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రమణ శాసనసభలో టీడీపీ ఉప నాయకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత టీటీడీపీ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమణ హుజురాబాద్ బై పోల్స్ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన ఎల్.రమణకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర కేబినెట్ కూర్పు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఈ విషయం ఆధారపడి ఉన్నప్పటికీ సామాజిక వర్గాల కోణంలో రమణకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు లేకపోలేదంటున్న వారూ లేకపోలేదు. ఒక వేళ సీఎం కేసీఆర్ రమణకు మంత్రిగా అవకాశం కల్పిస్తే తొలిసారి ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే ఆ పదవి పొందినట్టు అవుతుంది. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గెలిచిన తొలిసారే మంత్రి పదవి దక్కించుకున్న నేతగా రికార్డు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే మంత్రి మండలిలో రమణకు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

Related Posts