YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

లాభాలు బాగు...ఆయిల్ పామ్ సాగు

 లాభాలు బాగు...ఆయిల్ పామ్ సాగు

నిజామాబాద్, డిసెంబర్ 16,
నిజామాబాద్‌ జిల్లా రైతులు ఆయిల్‌పామ్‌ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. నీటి వనరులు పుష్కలంగా ఉండడంతో ఎప్పుడూ వరి సాగుచేసే జిల్లా రైతాంగం.. ధాన్యం సేకరణలో కేంద్రం పెడుతున్న పేచీలతో పంటల ఎంపికలో మార్పులు చేస్తున్నది. వరిసాగుతో ఎదురయ్యే కష్టాలను ముందుగానే గ్రహించిన సీఎం కేసీఆర్‌ నూనెగింజలను సాగు చేసేలా రైతన్నను ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలోని నేలలు ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలంగా ఉండడంతో ఆ దిశగా ఉద్యానశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్‌ సౌకర్యాలపై రైతుల సందేహాలు తీర్చేందుకు జిల్లా నుంచి 1500మందిని ఎంపిక చేసి ఖమ్మం జిల్లాలో క్షేత్రస్థాయి సందర్శనకు తీసుకెళ్లేం దుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని చెప్పుకుంటున్న కేంద్రం.. విత్తనాల దిగు మతిపై ఉన్న సుంకాన్ని 5 నుంచి 30 శాతానికి పెంచింది. దీంతో లక్ష విత్తనాలకు రూ.2.75లక్షలు ఖర్చు కావాల్సి ఉండగా సుంకం పెంపుతో రూ.22లక్షలు అవుతున్నది.నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సాగవుతున్న మొత్తం వ్యవసాయ భూమిలో దాదాపు 75శాతం వరి పంటలపైనే రైతులు దృష్టి పెడుతున్నారు. నీటి వనరులు పుష్కలంగా అందుబాటులో ఉండడంతో ఇతరత్రా పంటల సాగుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో దిగుబడులు ఆశించిన దానికన్నా మిన్నగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ధాన్యం సేకరణలో కేంద్రప్రభుత్వం రోజుకో మెలిక పెడుతున్నది. నిబంధనలను బూచీగా పెట్టి మర ఆడించిన బియ్యాన్ని సేకరించేందుకు ససేమిరా అంటున్నది. రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని రూ.వేల కోట్లు పెట్టి కొనుగోలు చేస్తున్నది. ఈ పరిస్థితిలో వచ్చే యాసంగిలో వరి పంట సాగు చేస్తే ఎదురయ్యే కష్టాలను గ్రహించిన సీఎం కేసీఆర్‌… ఇతర పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కూరగాయలు, అపరాల సాగుతోపాటు ఆయిల్‌పామ్‌ వంటి నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర సర్కారు నిశ్చయించింది. ఇప్పటికే రాయితీలు కూడా ప్రకటించింది. ఉద్యాన శాఖ అధికారులు సైతం నిజామాబాద్‌ జిల్లాలో ఔత్సాహికులైన 1500 మంది రైతులను గుర్తించి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.నూనె గింజల ఆధారిత సాగు పై రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా డి మాండ్‌ ఉన్న ఆయిల్‌పామ్‌ సాగును భారీగా పెంచేందుకు సీఎం కేసీఆర్‌ గతంలోనే నిర్ణయించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ప్రణాళికలు సేకరించాలని ఆదేశాలు సైతం జారీ చేశారు. ప్రభుత్వ సూచనల తో నిజామాబాద్‌ జిల్లాలో 55వేల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టాలని ప్ర ణాళికలు సిద్ధం చేశారు. ఆయిల్‌పామ్‌ సాగు కు అంగీకారం తెలిపిన వారిని గుర్తించి వారి కి శిక్షణ సైతం ఇప్పించారు. పంట సాగుపై అవగాహన కల్పించడంతో ఔత్సాహికులు ఎదురు చూస్తున్నారు. ఆర్మూర్‌ మండలం చేపూ ర్‌ శివారు నర్సరీలో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా రైతులను బృందాల వారీగా ఖమ్మం జిల్లాకు పంపించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో నలుగురు ఉద్యాన విస్తరణాధికారులు ఆసక్తి ఉన్న రైతుల వివరాలను సేకరించారు.వ్యవసాయక జిల్లాగా పేరొందిన నిజామాబాద్‌లో వరి సాగు విస్తీర్ణం భారీగా ఉంటుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ తీరుతో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల్లో ఇతర పంటలు పండించాలనుకునే వారు ఆయిల్‌పామ్‌ సాగువైపు దృష్టి సారిస్తున్నారు. కొత్త పంట కావడంతో సాగు యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్‌ అవసరాలపై రైతుల్లో సందేహాలు ఉన్నాయి. సాగుదారులను ఖమ్మం తీసుకెళ్లి అక్కడి రైతుల అనుభవాలు వివరించేలా చూడాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఉద్యాన శాఖను ఆదేశించారు. జిల్లా నుంచి సుమారు 1500మంది రైతులను అక్కడికి పంపేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. పామాయిల్‌ను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటుండడంతో దీని సాగుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ పంట సాగు చేసే రైతులకు ప్రత్యేక రాయితీలివ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం రూ.26వేలు, రెండు, మూడు సంవత్సరాల్లో రూ.5వేల చొప్పున రాయితీ ఇవ్వనున్నది. మరోవైపు నిజామాబాద్‌ జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగుకు అనుకూలమైన నేలలు కూడా ఉన్నట్లుగా ఉద్యాన శాఖ పేర్కొంది. ఇప్పటికే ఆయిల్‌పామ్‌ విత్తన కంపెనీ ప్రతినిధులు నేరుగా ఉద్యాన సిబ్బందికి ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇచ్చారు. మండలాల వారీగా సాగుదారులకు అధికారులతో శిక్షణ ఇవ్వాలని సర్కారు ఆదేశించింది.ఆయిల్‌పామ్‌ సాగుకు కేంద్రం ఆత్మనిర్భర్‌ పేరుతో బొటాబొటిన ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నది. రైతుకు మేలు చేస్తున్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూనే… విత్తన దిగుమతులపై సుంకం పేరుతో భారీగా వడ్డన వేస్తుండడంతో రైతులు ఆక్షేపిస్తున్నారు. ఓవైపు రాయితీలంటూ ప్రకటనలు చేస్తూనే మరోవైపు దొడ్డి దారిలో పన్నుల రూపంలో వాతలు పెట్టడం ఏంటంటూ ఔత్సాహికులు ఆందోళన చెందుతున్నారు. విత్తన మొలకల దిగుమతులపై కేంద్రం ఇటీవల దిగుమతి సుంకాన్ని 5 నుంచి 30శాతానికి పెంచింది. మలేషియా, కోస్టారికా, అమెరికా నుంచి మన దేశం ఏటా లక్షలాది విత్తనాలను దిగుమతి చేసుకుంటుంది. అక్కడి నుంచి తెచ్చిన మొలకలను పాలిథిన్‌ బ్యాగుల్లో ఉంచి మొక్కలుగా పెంచుతారు. ఏడాదిపాటు పెంచాక రైతులకు సరఫరా చేస్తారు. దిగుమతి సుంకం పెంపుతో ఇతర దేశాల నుంచి లక్ష విత్తనాలు దిగుమతికి చేయడానికి గతంలో రూ.2.75లక్షలు ఖర్చు కాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రూ.22లక్షలు అవుతున్నది. ఈ లెక్కన కేవలం విత్తన మొలకలపైనే రూ.19.25 లక్షలు అదనపు భారం పడనున్నది. దిగుమతి సుంకం భారీగా పెరగడంతో ఆయిల్‌పామ్‌ విత్తనాల కొనుగోలుకు కంపెనీలు వెనుకంజ వేస్తుండడంతో సాగుకు సిద్ధమైన ఔత్సాహికులంతా కేంద్ర సర్కారు నిర్ణయంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

Related Posts