కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందని, ఈ విజయం తెలంగాణ రాష్ట్రంలో కీలక రాజకీయ మలుపుగా మారుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ అన్నారు.కర్ణాటకలో తెలుగు ప్రజలు అధికంగా గల గోవిందరాజ్‌పేట నియోజక వర్గంలో డాక్టర్ లక్ష్మన్ విస్తృత ప్రచారం నిర్వహించారు. బిజెపి అభ్యర్థి సోమన్నకు ఓటు వేసి గెలిపించాలని తెలుగు ప్రజలను కోరారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతున్నాయని, మోదీ పథకాలతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదుగుతున్నారని ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మన్ అన్నారు. ఎక్‌డడ ఎన్నికలు జరిగినా ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారని, దేశంలోని 21 రాష్ట్రాల్లో ఇవాళ బిజెపి అధికారంలో ఉందని, కర్ణాటకలో బిజెపి గెలుపు ఖాయమని, ఇదే గెలుపు తెలంగాణ రాష్ట్రంలోనూ కీలక రాజకీయ మలుపుగా మారనుందని డాక్టర్ లక్ష్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.న్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైన పరిపాలనను అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ.. అనేక ప్రజా కర్షక పథకాలను అమలు చేస్తున్నారని, ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి సుకన్య యోజన, ప్రధాని ఫసల్ బీమా యోజన, జన్‌ధన్ పథకం, బేటీ బచావో- బేటీ పడావో, ముద్రా యోజన, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి పథకాలను అమలు చేస్తూ.. దేశంలోని కార్మికులు, కర్షకులు, మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు..ఇలా సబ్బండ వర్ణాల అభిమానాన్ని చూరగొంటున్న ఏకైక ప్రభుత్వం మోదీ ప్రభుత్వమని డాక్టర్ లక్ష్మన్ కొనియాడారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో కీలక మార్పులు సంభవిస్తాయని డాక్టర్ లక్ష్మన్ స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ సర్కార్ నెరవేర్చలేదని, టీఆర్ఎస్ పాలనతో విసుగు చెందిన ప్రజలు..బిజెపి వైపు ఆశగా చూస్తున్నారని డాక్టర్ లక్ష్మన్ పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారని డాక్టర్ లక్ష్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.