గుంటూరు, డిసెంబర్ 17,
నరసరావుపేట పార్లమెంట్‌పై ఈ మధ్య ఓ నేతకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. పార్టీలు పక్కనపెట్టి ప్రజాసేవ చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యేలను, స్థానికులు కలుపుకొని హల్‌చల్ చేస్తున్నారు. ఉంటే ఢిల్లీలో.. లేదంటే నరసరావుపేటలో.. ఇదే నా టార్గెట్..! నేను మీ వాడినే అంటూ ఊరూరు తిరుగుతున్నారట. ఇంతకీ ఢిల్లీ నుంచి నరసరావుపేటపై ప్రేమ కురిపిస్తున్న నేత ఎవరు?జీవీఎల్ నరసింహారావు. ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా బీజేపీకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కోటాలో రాజ్యసభ సభ్యుడు. ఉన్నట్టుండి జీవీఎల్‌కు నరసరావుపేటపై కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. నిత్యం పేటలో లోక్‌సభ పరిధిలో పర్యటిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పల్నాడు ప్రాంత వాసులకు ఊహించని అభివృద్ధి అందిస్తానని హామీలు ఇస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తులు ఉంటాయో లేదో తెలియదు. ఏ పార్టీ ఎవరితో కలుస్తుందో.. కలవదో తెలియదు. కానీ మాత్రం ముందస్తుగా ఇల్లు సర్దుకుంటున్నారట. పుట్టింది ప్రకాశం జిల్లా బల్లికురువ అయినా బాల్యం మొత్తం నరసరావుపేటలోనే సాగిందట. ఇంటర్మీడియట్ వరకు నరసరావుపేటలో ఆ తర్వాత బాపట్లలో చదువుకున్న ఆయన సెఫాలజిస్ట్‌గా ఫేమస్ అయ్యారు. అలా బీజేపీకి దగ్గరై.. ఆ పార్టీలో కీలక నాయకుడిగా మారారు. ప్రస్తుతం ఆయన చూపంతా నరసరావుపేట అభివృద్ధిపై పెట్టానని చెబుతున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ ఏం లేదు మొత్తం పేట అభివృద్ధి అంతా నాదే బాధ్యత అని నరసరావుపేట నామస్మరణ జపం చేస్తున్నారట .నరసరావుపేట రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు.. దాని సమీపంలోనే పార్క్ అభివృద్ధి.. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు స్థల అన్వేషణ.. మంగళగిరి ఎయిమ్స్‌కి అనుంబంధంగా మరొక వైద్య విభాగాన్ని ఏర్పాటు చేస్తామని జీవీఎల్ బల్లగుద్ది చెబుతున్నారట. మాచర్ల నడికుడి పిడుగురాళ్ల రైల్వేస్టేషన్ల అభివృద్ధి ఎలా ఉందంటూ పేట లోక్‌సభ పరిధిలో జీవీఎల్ చక్కర్లు కొట్టారు. మరోవైపు గురజాల రైతుల కష్టాలు తీర్చేందుకు స్పైసిస్ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరిస్తున్నారు. తాను పుట్టింది ప్రకాశం జిల్లా అయినా బాల్యం మొత్తం పేటలోనే సాగిందని.. అందుకే ఈ ప్రాంతానికి ఏదైనా చెయ్యాలన్న సంకల్పంతోనే పనులు చేపట్టినట్టు ఆయన వెల్లడిస్తున్నారు.వాస్తవానికి జీవీఎల్ ఆలోచన మరోలా ఉందని పేటలో ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం యూపీ నుంచి ఎంపీగా ఉన్నా.. సొంత రాష్ట్రం ఏపీ నుంచి ఎంపీగా ఢిల్లీకి వెళ్లాలని తహతహలాడుతున్నట్టు టాక్. అందుకే పల్నాడు అభివృద్ధి, గురుజాల అభివృద్ధి అని వాట్సాప్ గ్రూపులు పెట్టి మరీ తాను చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు, నాయకులకు ప్రత్యేకంగా తెలిసేలా ప్రచారం చేసే ఏర్పాటు చేసుకున్నారట. ఢిల్లీలో ఏ మాత్రం గ్యాప్ దొరికినా నరసరావుపేటలో ఉండేందుకు.. అక్కడ పర్యటించేందుకు ప్లాన్ చేస్తున్నారట.ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బీజేపీ ఒంటరిగా పోటీచేసినా లేకపోయినా ఏదో ఒక పార్టీతో రాబోయే ఎన్నికల్లో పొత్తు కుదురుతుందనే ఆశ బలంగా ఉండటంతో జీవీఎల్ ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అది అధికారపక్షమా.. ఇప్పటి ప్రతిపక్షమా అనేది పక్కన పెడితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా పేట పార్లమెంట్ సీటు మాకే అని ఆయన అనుచరులు సందడి చేస్తున్నారట. దీంతో పక్కపార్టీల నేతలు ‘ఆపండి రా’ మీ కామెడీలు అని సెటర్లూ వేస్తున్నారట.
నిజానికి జీవీఎల్ కు పార్లమెంట్‌కు పోటీ చేయాలన్న ఆశ, ఆలోచన ఉన్నాయో లేదో తెలియదు. కానీ.. ప్రస్తుతం ఆయన చేస్తున్న కార్యక్రమాలు.. చేపడుతున్న పర్యటనలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. భవిష్యత్‌తో బీజేపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది.. అసలు పేటలో సీటు కావాలని డిమాండ్ చేసేంత పరిస్థితి బీజేపీకి ఉంటుందా.. లేదా? అన్నదానిపై ఎంత చర్చ జరుగుతుందో.. జీవీఎల్ తీరుపైనా అంతే చర్చ సాగుతోంది. మరి.. ఈ కమలనాథుడి లోగుట్టు ఏంటో చూడాలి.