విశాఖపట్టణం, డిసెంబర్ 17,
ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ పారిశ్రామికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రతిపాదించిన విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వాస్తవానికి గతేడాదే పనులు పూర్తికావాలి. తాజా అంచనాల మేరకు వచ్చే ఏడాదికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నప్పటికీ, ఆచరణలో అది కూడా అనుమానాస్పదంగా మారింది. మరోవైపు పనుల పురోగతికి సంబంధించి ఆర్ధిక, భౌతిక పనుల పురోగతిలో భారీగా అంతరాలు కనిపిస్తున్నట్లు ఈ ప్రాజెక్టుకు రుణం ఇచ్చిన ఆసియన్ డెవలప్‌మెంటు బ్యాంకు చెబుతోంది. ఇతర అనేక సమస్యలకు కూడా పరిష్కారం కనిపించలేదని ఆ బ్యాంకు పేర్కొంటోంది. ఇప్పటివరకు భౌతికంగా 74 శాతం పనులు పూర్తయినట్లు చెబుతుండగా, ఆర్ధికంగా మాత్రం 49 శాతమే ఖర్చు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆ బ్యాంకు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో 2018లో మరో ఏడు ప్యాకేజిల పనులకు టెండర్లు ఖరారు చేసినప్పటికీ అందులో రెండు పనులు మాత్రమే 99 శాతానికిపైగా పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో కూడా రాంకీ సంస్థ ద్వారా చేస్తున్న పనులు 99.5 శాతం పూర్తయినట్లు చెబుతుండగా, ఆర్ధికంగా కేవలం 28 శాతమే ఖర్చు జరిగినట్లు ఎడిబి గుర్తించింది. 2019లో మరో రెండు ప్యాకేజిలకు టెండర్లు ఖరారు చేయగా, 2022 జూన్ నాటికి పూర్తి చేయాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపైనా ఎడిబి అసంతృప్తిగా ఉంది. ప్రాథమిక పర్యావరణ తనిఖీల్లో సరైన విధానాలు పాటించడం లేదని తేలినట్లు చెబుతోంది. ఈ తనిఖీలపై నివేదికలు కూడా తమకు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొద్ది నెలల క్రితం జరిగిన ట్రైపార్టీ సమావేశంలో తాము కోరిన నివేదికలు ఇచ్చిన తరువాతే మిగిలిన పనులను కొనసాగించాలని ఎడిబి తేల్చి చెప్పినట్లు సమాచారం. కొన్ని చోట్ల డిజైన్లలో మార్పులు చేసిన నిర్మాణ సంస్థలు, అధికారులు అందుకు తగిన నివేదికలు సమర్పించలేదని బ్యాంకు చెబుతోంది.ఆగస్టులో కారిడార్ పనులపై ట్రైపార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై నిర్మాణ సంస్థలు, అధికారులు అనేక హామీలిచ్చారు. అయితే వాటి అమలు కనిపించడం లేదన్నది ఎడిబి చెబుతోంది. . ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారికి ఇవ్వాల్సిన పరిహారం రాష్ట్ర ప్రభుత్వం వద్దనే పెండింగ్‌లో ఉన్నట్లు ఎడిబి చెబుతోంది