YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

తెరపైకి ప్రాంతీయ పార్టీల కూటమి

తెరపైకి  ప్రాంతీయ పార్టీల కూటమి

హైదరాబాద్, డిసెంబర్ 17,
తెలంగాణ సీఎం కేసీఆర్‌ మరోసారి ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారా? తమిళనాడు సీఎం స్టాలిన్‌తో భేటీలో ప్రాంతీయ పార్టీల కూటమి గురించే చర్చించారా? ఇకపైనా ఇదే దూకుడు కొనసాగిస్తారా? ఫెడరల్‌ ఫ్రంట్‌కు రూపు తీసుకొస్తారా?2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్ల ముందే జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. బెంగాల్లో మూడోసారి అధికారంలోకి వచ్చాక ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారు. శివసేన, ఎన్సీపీ నేతలతో భేటీ అయ్యారు. జాతీయస్థాయిలో బీజేపీని ఎదుర్కోవడంపై చర్చించారు మమత. ఆ సందర్భంగా UPA ఎక్కడుంది అని ఆమె చేసిన కామెంట్స్‌ చర్చకు దారితీశాయి.తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలో డీఎంకే అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాలిన్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. గతంలో ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను ప్రస్తావించారు కేసీఆర్‌. 2019 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు స్టాలిన్, మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరాయి విజయన్ , జార్కండ్‌ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్‌వాదీపార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లతో ఫెడరల్ ప్రంట్ పై చర్చించారు కేసీఆర్‌. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ రావడంతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచన ముందుకెళ్లలేదు.ఇప్పుడు ధాన్యం కొనుగోలుపై మోడీ సర్కార్‌, బీజేపీలపై తీవ్రస్థాయిలో టీఆర్‌ఎస్‌ మండిపడుతోంది. రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణి అవలంభిస్తోందని కేసీఆర్ విమర్శిస్తున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో టీఆర్ఎస్‌ ఎంపీలు ఆందోళన చేశారు.. సభలు బహిష్కరించారు. ఆ సందర్భంగా ఇతర విపక్ష పార్టీలు చేస్తున్న నిరసనలకు టీఆర్ఎస్‌ మద్దతు పలికింది.. TRS ఎంపీలు విపక్షపార్టీలతో శ్రుతి కలిపారు. ఇప్పుడు మారిన పరిణామాలతో జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌కు కేసీఆర్‌ మరోసారి కదలిక తెస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయితే అది ఎంత వరకు సక్సెస్‌ అవుతుందనే చర్చ జరుగుతోంది.ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా త్వరలో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలతో కేసీఆర్‌ సమాలోచనలు చేస్తారని టాక్‌. జాతీయ స్థాయిలో జరిగే పరిణామాలకు అనుగుణంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని టీఆర్ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తున్న.. గతంలో పనిచేసిన పార్టీలు కొత్త కూటమి కోసం జట్టు కట్టేందుకు ఎంత వరకు ముందుకొస్తాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. పూర్తిస్థాయిలో కేవలం ప్రాంతీయ పార్టీలతో ఒక ఫ్రంట్‌ ఏర్పాటైతే సక్సెస్‌ అయ్యే అవకాశాలు.. లాభనష్టాలపై ఆరా తీస్తున్నారట.దేశంలో పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లతో ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సంబంధాలు కొనసాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటమి కట్టేందుకు ప్రాంతీయ పార్టీలు కలిసి వస్తాయా? ఫెడరల్‌ ఫ్రంట్‌ ఐడియా ఎంత వరకు క్లిక్‌ అవుతుందో చూడాలి.

Related Posts