YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టికెట్లు ఫిక్స్

టికెట్లు ఫిక్స్

తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చినట్టు సమాచారం. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే..అభ్యర్థులకు ఒక సమాచారం అందిస్తే..వారు తమ నియోజకవర్గాల్లో ఇప్పటి నుంచే ప్రచారం చేసుకొని.. బూత్‌ లెవెల్‌ వరకు వెళ్లే అవకాశం ఉందని, తద్వార బలోపేతమయ్యేందుకు అవకాశం ఉంటుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు భోగట్టా. ఈ నేపథ్యంలో 19 అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రతి పక్ష వైసీపీ మెజార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసింది. మండపేట, రంపచోడవరం మినహా మిగిలిన 17 నియోజకవర్గాలకు అభ్యర్ధుల జాబితా దాదాపు ఖరారైనట్లే. 15 నియోజకవర్గాలలో కోఆర్డినేటర్లకు లైన్‌ క్లియర్‌ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం.

పెద్దాపురం, పిఠాపురం అభ్యర్థుల విషయంలో ప్రస్తుతానికి కోఆర్డినేటర్లకే ఇస్తా మన్న భరోసా ఇచ్చినా.. బలమైన అభ్యర్థులు దొరికితే పునరాలోచిస్తారన్న ప్రచారం సాగుతోంది. తుని, కొత్తపేట నియోజకవర్గాలలో పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డిలకు అధినేత జగన్‌ మళ్లీ పోటీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. ముమ్మిడివరం నుంచి మత్స్యకార నాయకుడు పొన్నాడ సతీష్‌, రామచంద్రపురం, జెడ్పీ మాజీ చైర్మన్‌ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలకు టికెట్‌ ఇచ్చినట్లు సంకేతాలొచ్చాయి.

మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీకి ఇద్దరు కోఆర్డినేటర్లు ఉన్నారు. వేగుళ్ల లీలాకృష్ణ, వేగుళ్ల పట్టాభి రామారావు. వీరిద్దరిలో ఎవరైతే బలమైన అభ్యర్ధి అనే దానిపై సర్వే నిర్వహించినట్లు సమాచారం. వైసీపీ సలహాదారుడు ప్రశాంత్‌ కిషోర్‌ బృందం 6 దఫాలు మండపేటలో సర్వే నిర్వహించినట్లు సమాచారం. అభ్యర్ధి ఎంపిక విషయంలో పీకే.. జగన్‌కి ఇచ్చిన నివేదికలో ఆర్ధిక పరమైన అంశం పరిగణలోకి తీసుకోకపోతే యువనేతకే అవకాశాలు ఎక్కువని నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై జగన్‌ త్వరలో నిర్ణయం ప్రకటిస్తారని చెబుతున్నారు. రంపచోడవరం నుంచి వైసీపీ తరఫున గెలుపొందిన వంతల రాజేశ్వరి టీడీపీలోకి మారడంతో ఇక్కడ వైసీపీ కొత్త అభ్యర్ధిని తెరపైకి తేవాలి. ఏజెన్సీలో ఒక వ్యక్తి చెప్పే అంశాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్‌ ఇస్తారని పార్టీలో ప్రచారం సాగుతోంది.

వైసీపీ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో స్పష్టత వచ్చినా, లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులపై ఇంకా క్లారిటీ లేదు. రాజమహేంద్రవరం నుంచి సినీ డైరెక్టర్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అమలాపురం నుంచి పోటీకి ఇన్‌కమ్‌టాక్స్‌ సర్వీసులో ఉన్న ఒక అధికారి టికెట్‌ ఖరారైన తర్వాత రిజైన్‌ చేసి వస్తారని చెబుతున్నారు. కాకినాడ లోక్‌సభ అభ్యర్ధిత్వం పెండింగ్‌లో పడింది. ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతుందంటూ ఒక సామాజిక వర్గం వ్యతిరేకగళం విప్పింది.. వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదని చెబుతున్నారు. జగన్‌ ముందు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ఎట్టకేలకు సమావేశాలు ఏర్పాటుచేసి.. హడావుడి చేసిన నేతలు తర్వాత పరిణామాలతో మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

Related Posts