భద్రాచలం ఇసుక ర్యాంపులో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. పర్యవేక్షణ కొరవడడంతో నిబంధనలకు పాతరేశారు. అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుందని అధికారులు బుకాయిస్తున్నప్పటికీ క్వారీని పరిశీలిస్తే అసలు సంగతి అర్థం అవుతుంది. నిబంధనలు పాటిస్తున్నారో? లేదో? తేల్చే ఓపిక అధికార గణానికి కరవైంది. ఇదే అదనుగా అక్రమార్కులు ఇసుకను ఇబ్బడి ముబ్బడిగా తోడేసి భారీగా సొమ్ము చేసుకొంటున్నారు. క్వారీలో లోడింగ్ దగ్గర నుంచి ఇసుక రవాణా వరకు పలు రకాల లొసుగులు ఉన్నప్పటికీ వాటికి ముసుగులేసి తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అక్రమార్కులకు కొందరు అధికారుల అండదండలు ఉండడంతో నిత్యం వందల వాహనాల్లో ఇసుక తరలించేస్తున్నారు. క్వారీకి అధికారికంగా అనుమతులున్నప్పటికీ వీటిమాటున రూ.లక్షల వ్యాపారం అక్రమంగా సాగుతోంది. పలుకుబడి ఉన్న ఒక ప్రజాప్రతినిధి అండదండలు ఉండడం వల్ల ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి నెలకొందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు లావాదేవీలు జరిగితే ఇబ్బందే ఉండేది కాదు. ఇలా జరిగితే తమకేమి మిగులుతాయని అనుకున్నారో ఏమోగానీ నిబంధనలు తుంగలో తొక్కేసి కాసుల వేటలో సహజ సంపదలను కొల్లగొట్టేస్తున్నారు.
కాంగ్రెస్ హయాంలో ఓ ప్రజాప్రతినిధి అండదండలతో భద్రాచలం శివారున కూనవరం రోడ్డులో ఇసుక క్వారీని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో రూ.కోట్లలో లావాదేవీలు సాగాయి. ఇది అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా క్వారీ ప్రాంతం తెలంగాణలో ఉండడంతో అడపాదడపా ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణాల అవసరాలకు ఇక్కడ నుంచి తోలకాలు సాగించగా దీని పేరుతో అక్రమంగా భారీగానే ఇసుక రవాణా జరిగింది. చాలాకాలం తర్వాత మళ్లీ వందల సంఖ్యలో వాహనాలకు ఇసుకను లోడింగ్ చేసే వ్యవస్థ మొదలైంది. మన్యం నిబంధల ప్రకారం కొంతమంది గిరిజనులు సొసైటీగా ఏర్పడ్డారు. గతంలో ఉన్న ఈ సొసైటీని రెన్యూవల్ చేసి కొనసాగిస్తున్నట్లు మైనింగ్ సిబ్బంది అంటున్నారు. గతంలో ఉన్న సొసైటీపై ఆరోపణలు ఉన్నందున కొన్ని మార్పులు చేశారు. అధ్యక్ష, కార్యదర్శులు కూడా ఉన్నారు. వాస్తవంగా వీరే క్వారీని నిర్వహించాల్సి ఉండగా వీరి అంగీకారంతో ఓ గుత్తేదారుకు బాధ్యతలను అప్పగించారు. అప్పుడప్పుడు సొసైటీ తరఫున పర్యవేక్షణ చేస్తున్నప్పటికీ ఆర్థిక లావాదేవీలన్నీ గుత్తేదారు పర్యవేక్షణలో ఉండడంతో లాభాపేక్ష కోసం కొన్ని నిబంధనలను గాలికొదిలేశారు.
క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ.600. ట్రాక్టర్‌కు 2 నుంచి క్యూబిక్ మీటర్లు అవసరం. లారీకి సామర్థ్యాన్నిబట్టి 7 నుంచి 14 క్యూబిక్ మీటర్ల ఇసుకను లోడ్ చేయవచ్చు. ఈ మేరకు అంతర్జాలంలో వాహనాల నిర్వాహకులు ఇసుకను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చి డంపింగ్ పాయింట్ నుంచి తమ వాహనాలలో లోడింగ్ చేసుకుని తమకు కావాల్సిన చోటకు తీసుకెళ్తారు. వినియోగదారులకు చేరే సరికి రవాణా ఛార్జీలు అదనంగా ఉంటాయి. ఈ ప్రక్రియలో డంపింగ్ పాయింట్ వద్ద జరిగే మతలబు అంతా ఇంత కాదు. 7 క్యూబిక్ మీటర్ల ఇసుకను నిబంధనల ప్రకారం తీసుకుంటున్నారు. ఇదంతా చట్టబద్దం. అదనంగా మరో క్యూబిక్ మీటరును నేరుగా కొనుగోలు చేసుకుంటున్నారు. దీనికి సుమారు రూ.1000 డంపింగ్ పాయింట్ వద్ద కాంట్రాక్టర్ కు అనుకూలంగా ఉండే వ్యక్తులకు వాహనాల తరపు వారు చెల్లిస్తున్నట్లు తెలిసింది. వే బిల్లులో ఉన్నదాని కన్నా ఎక్కువ బరువు లోడు రవాణా జరుతోంది. ఇలా చేయడం వల్ల సొసైటీ లెక్కల్లో ఇది ఉండదు. అధికారులు చూపించే వాటిలో కనిపించదు. పరిమితికి మించి హైదరాబాద్ వంటి చోట్లకు వెళ్లడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల రెండు లారీలను అధికారులు అదుపులోకి తీసుకున్నప్పటికీ అది అప్పటి వరకే పరిమితమైంది. కొంతమంది ట్రాక్టర్ యజమానులు తమ వాహనాల పేరిట నాలుగు క్యూబిక్ మీటర్లకు బిల్లులు తీసుకుని మరో ఒకటి, రెండు క్యూబిక్ మీటర్లను అదనంగా కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఇవన్నీ లెక్కా పత్రం లేనివే.
క్వారీ నుంచి ప్రతీరోజు ఇసుకను లోడింగ్ చేసుకుని వచ్చి ఒడ్డు మీద ఏర్పాటు చేసిన డంపింగ్ పాయింట్‌లో అన్‌లోడ్ చేస్తుంటాయి. దీనికి 30 ట్రాక్టర్లను ఉపయోగిస్తున్నారు. ఇసుకలో సుమారు కిమీ విస్తీర్ణంలో అక్కడక్కడ క్వారీలను ఏర్పాటు చేశారు. లోడింగ్‌లో 100 మందికి పైగా పనివారు పాల్గొంటున్నారు. పనివారికి రోజుకు సుమారు రూ.500 కూలి పడుతుండగా డ్రైవర్లకు రోజుకు రూ.500 వేతనం అందుతుంది. వీటిని గుత్తేదారు చెల్లిస్తున్నారు. ఒడ్డు మీద ఉన్న డంపింగ్ పాయింట్ నుంచి గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన క్వారీ వరకు వాహనాలు తిరిగేలా తాత్కాలికంగా దారిని ఏర్పాటు చేయాలన్నది నిబంధన. ఈ దారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ట్రాక్టర్లు ఎదురైనప్పుడు పక్కకు తిప్పితే అవి ఇసుకలో దిగబడుతున్నాయి. ఒకచోట కల్వర్టు నాసిరకంగా మారింది. మరో దగ్గర దారికి ఆనుకుని ఇసుకను తవ్వడంతో పెద్ద లోయలా మారింది. ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు ఇసుక ట్రాక్టర్లు పడినట్లు తెలిసింది. క్వారీలో జరిగే తంతు బయటకు రాకుండా కొంతమంది పెద్దలు సహకరించడంతో ఈ వ్యాపారం మూడు ట్రక్కులు ఆరు లోడులుగా వర్ధిల్లుతోంది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఒక క్వారీని ఏర్పాటు చేసి జేసీబీ సాయంతో ఇసుకను లోడింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్మాణాలైనా గుత్తేదారులే నిర్మిస్తారు. వీటికి జేసీబీని వాడడం వల్ల పర్యావరణం పరిఢవిల్లుతుందా ఏమిటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.