YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డీఎస్ చేరికకు బ్రేక్

డీఎస్ చేరికకు బ్రేక్

హైదరాబాద్, డిసెంబర్ 17,
రాజకీయ కురు వృద్ధుడు డీ.శ్రీనివాస్ (DS) రాజకీయ భవితవ్యం ఏంటీ? ఆయన నెక్ట్స్‌ పొలిటికల్ స్టెప్‌ ఎటువైపు? అన్నది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి వెళ్లాలనకున్న డీఎస్‌కు అక్కడ నో ఎంట్రీ బోర్డు పెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన ధర్మపురి శ్రీనివాస్.. మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డీఎస్.. పదవీకాలం మరో మూడు నెలల్లో ముగుస్తుంది. చాలా కాలంగానే ఆయన టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్‌లోకి జంప్‌ కావడం ఖాయమన్న ప్రచారం చాలారోజులుగా సాగుతోంది. రాజ్యసభ ఎంపీ పదవీకాలం కూడా ముగుస్తుండటంతో.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. కాంగ్రెస్‌తోనే తన రాజకీయ శేషజీవితం ముగియాలన్న డీఎస్‌ కోరికపై సోనియా సానుకూలంగా స్పందించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అతనికి వ్యతిరేక సెగ ఎదురుకావడంతో కథ అడ్డం తిరిగింది. డీఎస్‌ రాకను రాష్ట్ర పార్టీ నేతలతో పాటు నిజామాబాద్‌ జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో.. డీఎస్‌ ఎంట్రీకి కాంగ్రెస్‌ అధిష్టానం నో చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.సోనియాతో చర్చల తర్వాత డీఎస్‌ పార్టీలోకి ఎంట్రీ విషయాన్ని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌కు అధిష్టానం అప్పగించింది. దాంతో డీఎస్‌ను చేర్చుకునే విషయంపై నిజామాబాద్‌ నేతలతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలతో ఠాగూర్‌ మాట్లాడారు. కానీ ఎవరి నోట విన్నా.. డీఎస్ రీ ఎంట్రీపై వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తోంది.  సోనియా, రాహుల్‌ గాంధీలపై డీఎస్‌ కుమారుడు నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు అందుకు ఆజ్యం పోసినట్లు సమాచారం.  డీఎస్‌ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్నది రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వాదనగా తెలుస్తోంది.డీఎస్ రీ ఎంట్రీకి పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో..  రాహుల్‌గాంధీ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు పార్టీల్లో ఉండడం కుదరదని, ఒకవేళ డీఎస్‌ చేరాలనుకుంటే ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్‌లో చేరితేనే స్వాగతించాలని రాహుల్‌ కూడా సూచించినట్టు సమాచారం. దాంతో కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న డీఎస్‌ ఎంట్రీ ప్రయత్నాలకు ఎండ్‌ కార్డు పడినట్టు తెలుస్తోంది.డీఎస్‌ చేరికపై రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడేందుకు.. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి సీఎల్పీ నేత భట్టితో పాటు రాష్ట్ర నేతలు, కొంతమంది నిజామాబాద్‌ జిల్లా నేతలకు పిలుపు వెళ్లింది. ఆ తర్వాత డీఎస్‌పై వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో ఆ నేతల పర్యటన రద్దయింది. మళ్లీ కాంగ్రెస్‌లో చేరి రాజకీయంగా పూర్వవైభవం పొందాలనుకున్న డీఎస్‌కు మాత్రం.. ఆ కోరిక తీరే అవకాశం లేకుండా పోయినట్టు అర్ధమవుతోంది. కాంగ్రెస్ సానుకూలంగా స్పందించని నేపథ్యంలో ఆయన భవిష్యత్ రాజకీయ వ్యూహం ఎలా ఉండబోతుందన్న అంశం నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Related Posts