గ్రామాల అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్. అయితే రాష్ట్రంలోని అనేక గ్రామాలు సమస్యల్లోనే మగ్గుతున్నాయి. శ్రీకాకుళంజిల్లా సీతంపేట పరిధిలోని వాబ అనే గిరిజన కుగ్రామం సైతం ఇదే దుస్థితిలో ఉంది. స్థానికంగా అనేక సమస్యలు తిష్ట వేశాయి. దీంతో ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. వాబలో ప్రస్తుతం తాగునీటికి కటకట నెలకొంది. గ్రామంలోని రెండు బోర్లుకు రెండు బోర్లు పనిచేస్తున్నప్పటికీ ఒక బోరు నీరు మాత్రమే తాగడానికి ఉపయోగిస్తున్నారు. ఈ వేసవిలో నీరు పూర్తిగా తగ్గిపోతుంది. మరోబోరు కిలుం వాసన రావడంతో వాడుకకు మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో తాగునీటి సమస్య ఏర్పడింది. మంచినీరు చాలకపోతే డెప్పిగూడ, చింతమానుగూడ బావి వద్దకు రెండు పర్లాంగులు నడిచివెళ్లి తెచ్చుకుంటున్నారు. మరోవైపు వంశధార కుళాయి పైపులైన్ అమర్చి ఏడాది గడుస్తున్నా నీరు రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వాబలో 18 కుటుంబాలు మాత్రమే నివాసం ఉంటున్నాయి. ఉన్నవి తక్కువ ఇళ్లే అయినా ప్రభుత్వం తరపున మూడు ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని గిరిపుత్రులు వాపోతున్నారు. మిగతావారికి మంజూరు కాలేదని దీంతో తమకు తచిన విధంగా నిర్మించుకున్న ఆవాసాల్లోనే బతుకీడుస్తున్నామని అంటున్నారు. దీనికి తోడు గ్రామంలో సిసిరోడ్లు, డ్రైనేజీలు లేవు. దీంతో స్థానికుల ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. వానాకాలం వస్తే మురికినీటితోనే సావాసం చేయాల్సి దుస్థితి నెలకొంటోందని అంతా అంటున్నారు. ఇక ప్రాథమిక పాఠశాల నిర్మించి 25 ఏళ్లు గడుస్తోంది. ఈ బడిలో 10 మంది విద్యార్థులే చదువుతున్నారు. వర్షాకాలంలో పాఠశాల నీరుకారుతోంది . ఈ విషయమై ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు ప్రజలు. ఇక మరుగుదొడ్లు బిల్లులు ఇంకా రాలేదు. ఈ సమస్యలపై అధికారులకు అనేకమార్లు తెలియజేసినా ఫలితం లేకుండా ఉందని చెప్తున్నారు. ఏదేమైనా అధికార యంత్రాంగం తమ ప్రాంత సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించే దిశగా సత్వరమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజనులకు అవసరమైన కమ్యూనిటీ హాలు మంజూరు చేయలని కోరుతున్నారు. సబ్సిడీ రుణాలు అందించాలని వేడుకుంటున్నారు.