YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివేకా హత్య కేసు సైడ్ ట్రాక్

వివేకా హత్య కేసు సైడ్ ట్రాక్

కడప, డిసెంబర్ 18,
వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పెద్దల హస్తం ఉందా?.. ఈ హత్య ఇంటి దొంగల పనేనా? .. అందుకే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడంటారు? ఈశ్వరుడే కాదు.. సీబీఐ వాళ్లు కూడా ఈ హత్య కేసులో నిందితులను పట్టుకోకుండా అంత పకడ్బందీగా పథక రచన చేశారా? ఆ క్రమంలోనే వివేకా హత్య కేసు సైడ్ ట్రాక్ పట్టించేందుకు అమ్మదొంగలు తయారయ్యారా? ... అంటే అవుననే సమాధానం వస్తుందని కడప జిల్లా వాసుల నుంచి. వైయస్ వివేకానందరెడ్డి మామూలు వ్యక్తి కాదు. ఆయన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ అందరికీ తెలిసిందే. మరి అలాంటి వ్యక్తి హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న ట్విస్ట్‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ ట్విస్ట్‌లన్నీ పరిశీలిస్తే..  టాలీవుడ్‌లో ఓ మాంచీ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోందని అంటున్నారు.  వివేకానందరెడ్డి హత్యపై తొలుత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి..  స్పందించారు. వివేకా గుండెపోటుతో మరణించారంటూ ఆయన మీడియా సాక్షిగా ప్రకటించారు. ఆ తర్వాత.. వివేకానందరెడ్డి.. దారుణ హత్యకు గురయ్యారంటూ అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అనంతరం నాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. మీడియా సాక్షిగా మాట్లాడుతూ.. వివేకా హత్య మరింత దారుణమా.. టీడీపీ నాయకులు, నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఈ హత్య ఛేదించడం పోలీసుల వల్ల కాదని.. సీబీఐ అయితేనే కరెక్ట్ అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు... సాధ్యమైనంత త్వరగా దోషులను పట్టుకోవాలని.. వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలని నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని మీడియా సాక్షిగా ప్రస్తుత సీఎం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం.. హైకోర్టులో ఈ కేసు సీబీఐకి ఇవ్వాలంటూ వేసిన కేసును సాక్షాత్తూ వైయస్ జగనే స్వయంగా విత్ డ్రా చేయడం.. అయితే అప్పటికే వివేకా హత్యపై టీడీపీ ప్రభుత్వం చేసిన సిట్‌ అధికారులను జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత  తరచు మార్చడం.. దీంతో వివేకా హత్య కేసు ఇంచ్ కూడా ముందుకు కదలక పోవడం.. ఆ క్రమంలో వివేకా కుమార్తె వైయస్ సునీత విసుగు చెంది.. ఈ హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన తండ్రి హత్య కేసులో వీళ్లే నిందితులుగా ఉండే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేయడం.... ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకుని సీబీఐ తమదైన శైలిలో ప్రశ్నించింది. ఆ క్రమంలో వైయస్ వివేకానందరెడ్డికి అత్యంత నమ్మకస్తులను కూడా సీబీఐ వదలకుండా ప్రశ్నించింది. ఆ క్రమంలో నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తాయని అంతా భావించారు. ఇక వివేకా వద్ద గతంలో డ్రైవర్‌గా పని చేసిన దస్తగిరి అప్రూవర్‌గా మారి.. జరిగినదంతా.. మొత్తం సీబీఐ ఎదుట చెప్పాశాడు. వివేకా హత్యకు కోట్లలో సుపారీ ఫిక్సీ అయిందని.. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులు వీళ్లేనంటూ పలువురి పేర్లను ప్రకటించడమే కాకుండా.. వివేకా రక్త సంబంధీకులు వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కరరెడ్డి కూడా దీనిలో ప్రధాన పాత్ర ఉందంటూ సంచలన  విషయాలు బయట పెట్టాడీ దస్తాగిరి. అయితే అప్పడే అసలు సిసలు రాజకీయం రాజుకుంది.అప్పటికే వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకీ తీసుకుంది. ఈ నేపథ్యంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి.. నేరుగా సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాసి... వివేకా హత్యతో ఆయన కుమార్తె వైయస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా ఉందని స్పష్టం చేశారు. ఆ తర్వాత భరత్ యాదవ్ అనే వ్యక్తి సైతం మీడియా సాక్షిగా ఇవే ఆరోపణలు గుప్పించడం గమనార్హం. మరోవైపు అనంతపురం జిల్లాకు చెందిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి హఠాత్తుగా తెరపైకి వచ్చి.. వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డిల పాత్ర ఉందని.. అందుకు సాక్ష్యం చెప్పాలంటూ తనపై సీబీఐ అధికారులు ఒత్తిడి తీసుకు వస్తున్నారని.. ఈ నేపథ్యంలో తన ప్రాణానికి హాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తు గంగాధర్ రెడ్డి అనంతపురం ఎస్పీ ఫకీరప్పను ఆశ్రయించారు. ఇంకోవైపు వివేకానందరెడ్డి వద్ద మూడు దశాబ్దాలగా పీఏగా పని చేసిన కృష్ణారెడ్డి సైతం కడప ఎస్పీని కలిసి... తనకు వివేకా కుమార్తె, అల్లుడు నుంచి ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు. దీనిని బట్టి చూస్తే బ్లాక్ మెయిలింగ్, బురద చల్లడం ద్వారా ఎదుటి వ్యక్తిని ఆత్మరక్షణలో పడేయడం ద్వారా నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కడప జిల్లా వాసులు అంటున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ వేగానికి బ్రేకులు వేసేందుకే నిందితులు ఇలాంటి ట్రిక్కులు ఉపయోగిస్తున్నారని జిల్లా వాసులు  చెబుతున్నారు. ఇలా చేయడం ద్వారా వివేకా హత్య కేసు దర్యాప్తు.. సైడ్ ట్రాక్ పట్టడం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు. ఏదీ ఏమైనా ఈ హత్య కేసులో ఒకరు తర్వాత ఒకరు ఎంట్రీ ఇచ్చి.. దర్యాప్తు సంస్థపైనా... బాధిత కుటుంబ సభ్యులపైన ఏకంగా పోలీసులకే ఫిర్యాదులు చేయడం చూస్తుంటే...  నేటి రాజకీయాల్లో బిహారీ బాబు ప్రశాంత్ కిషోర్ మార్క్ రాజకీయం లాగే.. ఈ వివేకా హత్య కేసులోని ఈ ట్విస్ట్‌లు చూస్తే.. ప్రశాంత్ కిషోర్ మార్క్ రాజకీయాలని గుర్తు చేస్తున్నాయని కడప జిల్లా వాసులు గుర్తు చేస్తున్నారు. వివేకా హత్య కేసులో ఎన్ని ట్విస్ట్‌లు జరిగినా.. ఈ కేసును ఛేదించడం సీబీఐ ముందున్న అతి పెద్ద సవాల్ అని కడప వాసులు విశ్లేషిస్తున్నారు.

Related Posts