YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈటల దారెటు...?

ఈటల దారెటు...?

కరీంనగర్,  డిసెంబర్ 18,
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగ వచ్చును. అందులోనూ పార్టీలు మారడం అంగీ మార్చినంత ఈజీ వ్యవహరంగా సాగిపోతున్న ప్రస్తుత సమయంలో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారని వార్తలు రావడం పెద్ద విషయం కాదు. విశేషం కాదు. సహజం. ఒక పార్టీ నాయకుడు ఇంకొక పార్టీ నాయకుని కళ్ళతో పలకరించుకున్నా, నిముషాల్లో స్క్రోలింగులు వచ్చే రోజుల్లో ఈటల గురించి పుకార్లు రావడంలో ఆశ్చర్యం లేదు.  అయితే, నిన్న గాక మొన్న, అధికార తెరాస నుంచి బయటకు వచ్చి, బీజేపీలో చేరిన ఈటల రాజేందర్, ఇంతలోనే మళ్ళీ పార్టీ మారుతారా? కాంగ్రెస్ పార్టీలో చేరతారా?  అంటే, కొంచెం చాలా ఆలోచించవలసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజంగా,ఈటల అలాచేస్తే, అది ఆయన రాజకీయ భవిష్యత్’ను ప్రశ్నార్ధకం చేస్తుందని అంటున్నారు. నిజానికి, అలాంటిది ఏమీ లేదని, తాను పార్టీ మారే ప్రశ్నే లేదని, ఈటలే స్వయంగా ప్రకటించారు. పార్టీలు మారడం తన తత్త్వం కాదని, తెరాస నుంచి కూడా తాను బయటకు రాలేదని, బయటకు పపంపారని ఈటల వివరణ ఇచ్చారు. అయినా రాజకీయ వర్గాల్లో మాత్రం ఆ చర్చ అలా సాగుతూనే ఉంది.  అదలా ఉంటే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, బీజేపీలో మరో చర్చ జరుగుతోంది. బీజీపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. అదే సమయంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే, ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడం అనివార్యమని జాతీయ నాయకత్వం స్పష్టమైన అభిప్రాయంతో ఉంది. ఈ నేపధ్యంలో ఇటు తెరాస నుంచి అటు కాంగ్రెస్ నుంచి కూడా గట్టి పట్టున్న నాయకులను కమలం గూటికి చేర్చే కీలక బాధ్యతను తెరాస నుంచి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి కమలం గూటికి చేరిన డీకే అరుణకు అధిష్టానం అప్పగించి నట్లు తెలుస్తోంది. తెరాసలో కింది స్థాయి కార్యకర్తల నుంచి నియోజక వర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరి పుట్టు పూర్వోత్తరాలు, ఆపసోపాలు అన్నీ, ఈటలకు కొట్టిన పిండే, కాబట్టి ఆ బాధ్యతలను పార్టీ అధిష్టానం ఆయనకు అప్పగించిందని అంటున్నారు. ఇప్పటికేఈటల ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే ఈటల తెరాసలో అసంతృప్తులు తమతో టచ్’లో ఉన్నారని అంటున్నారు. ఖచ్చితంగా ఇంతమంది ఆని కాకుండా, పట్టున్న నాయకులను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఈటల అడుగులు వవేస్తున్నారని, ఇటు బీజేపీలో తెరాసలోనూ చర్చ జరుగుతోంది. ఈటల అడుగులు వేయడం వల్లనే   ముఖ్యమంత్రి ఉన్నట్లుండి పార్టీ మీద దృష్టి పెట్టారని, జిల్లా పర్యటనలకు బయలు దేరుతున్నారని తెరాస పార్టీలోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా, బీజేపీ అదిష్టానం తెరాసకు బీజేపీని ప్రధాన ప్రత్యర్ధిగా ప్రజలలోకి తీసుకు వెళ్ళే ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్’ కు ఈటలను ప్రత్యర్ధిగా నిలిపేందుకు కూడా సిద్దమవుతున్నట్లు సమాచారం. కేంద్ర నాయకత్వం ఉంచి అలాంటి సంకేతాలు ఉన్నందునే ఈటల రాజేందర్ బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్’పై పోటీ చేసేందుకు అయినా సిద్ధమని ప్రకటించారని అంటున్నారు. అదలా ఉంటే, కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటల బర్తరాఫ్ అయినప్పటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని అనేక ఉహాగానాలు వినవచ్చాయి. అలాగే, ఆయన బీజేపీలో చేరి, హుజూరాబాద్ ప్రచారంలో తలమునకలై ఉన్న సమయంలోనూ, ఆయన బీజేపీలో ఇమడలేక పోతున్నారు. ఆయనకు, బీజేపీ నాయకులు సహకరించడ లేదు. ఆయన రేపోమాపో  బీజీపీకు గుడ్ బై చెపుతున్నారు .. ఇండిపెండెంట్’గా పోటీకి రెడీ అవుతున్నారు, కాంగ్రెస్’లో చేరుతున్నారు .. అంటూ చాలా ఉహాగానాలు వినిపించాయి. అయినా, అందులో ఏ ఒక్కటీ నిజం కాలేదు, ఇప్పుడు ఆయన కాంగ్రెస్’లో చేరుతున్నారు అంటూ వస్తున్న ఉహాగానాలు కూడా అంతే అంటున్నారు, ఈటల సన్నిహితులు. అంతేకాదు, కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఈటలను బయటకు పంపినా, ఒక విధంగా ఈటల కూడా అదే కోరుకున్నరని. ఆయనసన్నిహితులు అంటున్నారు.

బీజేపీ అధ్యక్షుడిగా ఈటల..?

ఈట‌ల రాజేంద‌ర్‌. తెలంగాణ‌లో సంచ‌ల‌నం. హుజురాబాద్ గెలుపుతో కేసీఆర్‌కు స‌రైన మొన‌గాడ‌ని నిరూపించుకున్న నేత‌. అరంగేట్రంతోనే బీజేపీలో టాప్ లీడ‌ర్‌గా ఎదిగిన నాయ‌కుడు. అందుకే, ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా.. బీజేపీలో అధిక ప్రాధాన్యం ల‌భిస్తోంది. ఒక్క గెలుపుతో అధిష్టానం దృష్టిలో ప‌డ్డారు. ఎమ్మెల్సీ పోటీలో ర‌వీంద‌ర్‌సింగ్‌ను బ‌రిలో నిలిపి ఢిల్లీ దృష్టిని ఆకర్షించారు. కావ‌ల‌సినంత ఆర్థిక బ‌లం. అంతులేని అనుచ‌ర గ‌ణం. ఉద్య‌మ నేత‌గా అభిమాన ద‌ళం. ప్ర‌భుత్వంలో, పాల‌న‌లో సుదీర్ఘ అనుభవం. ఇవి చాల‌వా ఈట‌ల రాజేంద‌ర్‌ను మ‌రింత ఎత్తుకు తీసుకెళ్ల‌డానికి. ఇప్పుడ‌దే జ‌రుగుతోంద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే ఈట‌ల రాజేంద‌ర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా నియ‌మిస్తారంటూ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి, స్టేట్ ప్రెసిడెంట్‌గా బండి సంజ‌య్ ఉన్నారుగా అనే అనుమానం రావొచ్చు. ఆ.. ఉన్నారు.. అంత‌కుముందు కె.ల‌క్ష్మ‌ణ్ కూడా ఉన్నారుగా. అలానే, ఇప్పుడు బండి సంజ‌య్ ఉన్నారు. బీజేపీ వ్య‌క్తుల పార్టీ కాదు. సిద్ధాంత పార్టీ. ద‌మ్మున్న పార్టీకి ద‌మ్మున్న లీడ‌రే కావాలి. ఆ ద‌మ్ము ఇప్పుడు ఈట‌ల‌లో చూస్తున్నారు. బండి సంజ‌య్ దూకుడుగానే వ్య‌వ‌హ‌రిస్తున్నా.. కేసీఆర్ కొమ్ములు వంచాలంటే ఆయ‌న బ‌లం స‌రిపోవ‌ట్లేద‌ని అంటున్నారు. బీజేపీ అధ్య‌క్షుడు కాక‌ముందు బండికి అంత‌గా బ్యాక్‌గ్రౌండ్ లేదు. వాక్‌చాతుర్యంలో కేసీఆర్ ముందు నిల‌వ‌లేక‌పోతున్నారు. హైద‌రాబాద్‌కే ఎక్కువ‌గా ప‌రిమితం అవుతున్నార‌నే ఆరోప‌ణ ఉంది. స‌బ్జెక్ట్ మీద అంత‌లా ప‌ట్టు ఉండ‌దు. మ‌రీ, ముఖ్యంగా అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం లేద‌ని.. బండి సంజ‌య్ వ‌చ్చాక పార్టీలో గ్రూపులు బాగా పెరిగిపోయాయ‌ని చెబుతున్నారు. అందుకే, బండికి అల్ట‌ర్నేట్‌గా ఈట‌ల‌ను అధ్య‌క్ష పీఠంపై కూర్చోబెట్ట‌బోతున్నారంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. అదే, బండి సంజ‌య్ వ‌ల్ల బీజేపీలో గ్రూపులు కుమ్ములాట‌లు పెరిగాయ‌ని అంటున్నారు. కిష‌న్‌రెడ్డి వ‌ర్సెస్ బండి సంజ‌య్ ఎపిసోడ్ పార్టీలో అంద‌రికీ తెలిసిందే. వివేక్‌కు సైతం బండితో పొస‌గ‌డం లేద‌ని.. విభేదాలు మ‌రింత ముదిరితే వివేక్ మ‌ళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతార‌ని టాక్‌. ఇలా బీజేపీలో బ‌ల‌మైన నాయ‌కులకు బండితో తేడాలొచ్చాయ‌ని.. వారంతా క‌లిసి ఈట‌ల రాజేంద‌ర్ పేరును అధిష్టానం ద‌గ్గ‌ర ప్ర‌స్తావిస్తున్నార‌ని తెలుస్తోంది. ధ‌ర్మ‌పురి అర్వింద్ సైతం అధ్య‌క్ష రేసులో ఉన్నా.. ఆయ‌న‌కు ఏ కేంద్ర మంత్రి ప‌ద‌వో ఇస్తారు కానీ.. ఈట‌ల‌నే స్టేట్ ప్రెసిడెంట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ‌గా ఉన్నాయ‌ని స‌మాచారం. ఉద్య‌మ నాయ‌కుడిగా కేసీఆర్‌తో స‌మాన స్థాయి ఉండ‌టం.. ప్ర‌జ‌ల్లో మంచి ఇమేజ్‌.. మంచి వాగ్ధాటి..  ఈట‌ల‌కు బాగా అనుకూలించే అంశాలు. హుజురాబాద్ ఎన్నిక‌ల్లో యావ‌త్ అధికార ఘ‌నానికీ ఎదురు నిలిచి పోరాడి గెలిచిన యోధుడు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ రెబెల్‌తో కారు పార్టీకి చెమ‌ట‌లు ప‌ట్టించిన రాజ‌కీయ చాణ‌క్యం. కేసీఆర్ గుట్టు మ‌ట్లు అన్నీ తెలిసిన నాయకుడు. గులాబీ ద‌ళాన్ని చీల్చ‌గ‌ల స‌త్తా ఆయ‌న సొంతం. అందుకే కేసీఆర్‌కు చెక్ పెట్టాలంటే ఈట‌ల‌నే క‌రెక్ట్ ప‌ర్స‌న్ అని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, ఇటు కిష‌న్‌రెడ్డితోనూ స‌త్సంబంధం.. అటు వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యే ర‌ఘునంద‌ర్‌రావు లాంటి వాళ్ల‌తో సాన్నిహిత్యం.. ఈట‌ల‌కు క‌లిసొచ్చే విష‌యాలు. పార్టీలో గ్రూపులు ప్రోత్స‌హించ‌డం.. హుజురాబాద్‌లో ఈట‌ల గెలుపున‌కు బండి సంజ‌య్ అంత‌గా స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం.. ఇటీవ‌లి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కావాల‌నే ఓటు వేయ‌క‌పోవ‌డం.. లాంటి ప‌రిణామాల‌పై బండికి వ్య‌తిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేరాయ‌ని తెలుస్తోంది. ఇలా, బండి సంజ‌య్ బ‌ల‌హీన‌త‌లు.. ఈట‌ల రాజేంద‌ర్ బ‌లాలుగా మారి.. త్వ‌ర‌లోనే బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా ఈట‌ల నియామ‌కం జ‌ర‌గ‌నుంద‌ని బీజేపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, ఆర్ఎస్ఎస్ వాది కాని వారికి ఆ ప‌ద‌వి ద‌క్కుతుందా అనే అనుమానం అక్క‌ర‌లేదంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ నుంచి వ‌చ్చిన కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా చేయ‌లేదా? ఇక్క‌డా అంతే. అంగ‌, అర్థ బ‌లాల‌తో పాటు కేసీఆర్‌ను ఎలాగైనా దెబ్బ‌కొట్టాల‌నే క‌సి, ప‌ట్టుద‌లే.. ఈట‌ల‌ను అధ్య‌క్ష పీఠానికి ద‌గ్గ‌ర చేస్తోంద‌ని చెబుతున్నారు.  త్వ‌ర‌లోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులుగా ఈట‌ల రాజేంద‌ర్ నియామ‌కం జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

Related Posts