YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆదమరిస్తే అంతే సంగతులు

ఆదమరిస్తే అంతే సంగతులు

స్పీడ్ థ్రిల్స్..బట్ కిల్స్. అంతే స్పీడ్ ఉత్కంఠగా అనిపించినా చివరికి మరణానికి దారితీస్తుంది. ఈ హెచ్చరికను ట్రాఫిక్ పోలీసులు తరచూ చేస్తుంటారు. పలు ప్రాంతాల్లో వార్నింగ్‌గా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికీ కొందరిలో మార్పు రావడంలేదు. చేతిలో బండి ఉంటే చాలు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇతరుల ప్రాణాలూ తోడేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని నేషనల్ హైవే 44 ఈ తరహా యాక్సిడెంట్లకే నిలయంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే భయపడాల్సి వస్తోందని వాపోతున్నారు. పలు వాహనాలు మితిమీరిన వేగంగా ప్రయాణిస్తున్నారని తరూచ ప్రమాదాలు సంభవిస్తున్నా  పలువురు వాహనచోదకుల్లో పెద్దగా మార్పురావడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వేగానికి తోడు రహదారిపై సూచిక పట్టీలు సరిగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరిమితికి మించిన వేగం, అడుగడుగునా నిబంధన ఉల్లంఘన, జంక్షన్ల వద్ద సరైన వెలుతురు లేకపోవడం తదితర కారణాలతో ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని చెప్తున్నారు. కామారెడ్డి జిల్లా అడ్లూల్‌ ఎల్లారెడ్డి వరకు జాతీయ రహదారి నిర్వహణే సరిగా లేదని కొంతకాలంగా స్థానికులు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ రహదారిని పటిష్టం చేసి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.  

 

వాస్తవానికి జాతీయ రహదారి 44.. 95 కిలో మీటర్లుగా ఉంది. ప్రతి మూడు కిలో మీటర్లకు ఒక ప్రమాదకర ప్రదేశం చొప్పున ఉన్నాయి. రోడ్డు నిర్మాణంలో లోపాలు, మానవ తప్పిదాలు వెరసి రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని అంచనా. అడ్డూఅదుపూలేని వేగంతో దూసుకుపోతున్న యువత వల్లే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని స్థానికులు స్పష్టంచేస్తున్నారు. ఇదిలాఉంటే నేషనల్‌ హైవేనే కాక నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలో 59 సర్వీసు రహదారులు ఇబ్బందికరంగానే ఉన్నట్లు సమాచారం. 44 నేషనల్ హైవే పక్క ఉన్న గ్రామాలకు వెళ్లేందుకు వేసిన రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని అంతా అంటున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. పలు రోడ్లు  మట్టితో నిండి యాక్సిడెంట్లకు కారణంగా మారుతున్నాయి. దీంతో ప్రయాణికులు నానాపాట్లు పడుతున్నారు. రహదారులు పటిష్టంగా లేకపోవడం వల్ల ఇప్పటికే పలువురు ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయాలపాలయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి రహదారుల నిర్వహణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.   

Related Posts