YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

గొంతు ఎండుతోంది..

 గొంతు ఎండుతోంది..

సవి తీవ్రత పలు ప్రాంతాల్లో నీటి కొరతను పెంచేసింది. కనీసం తాగు నీరు లేక ప్రజలు సతమతమవుతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో గుక్కెడు నీటికి కటకట నెలకొన్న దుస్థితి. దీంతో స్థానికులు ఇతర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. మరోవైపు వ్యవసాయ భూముల్లోనూ నీరు అడుగంటంది. దీంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. సాగునీటికి సమస్యలు ఏర్పడుతున్నాయని, పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కొత్తగా బోర్లు వేస్తున్నా ఫలితం ఉండడంలేదు. ఉన్న బోర్లు ఎండిపోయి.. కొత్త బోర్లలో నీరు పడక జనాలు నీటి కోసం అల్లాడిపోతున్న పరిస్థితి. జిల్లాలోని అనేక మండలాల్లో గతంతో పోలిస్తే భూగర్భజలమట్టం ప్రస్తుతం క్షీణించిపోయింది. భూగర్భజలాల పరిస్థితిని అంచనా వేసేందుకు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో అధికారులు పరీక్ష చేశారు. ఫిజోమీటర్ల ద్వారా భూగర్భజలమట్టం అంచనా వేశారు. జిల్లాలోని 15 ప్రాంతాలను గుర్తించి నీటి మట్టం వివరాలు తెలుసుకున్నారు. నెల వారీగా సేకరించిన వివరాల మేరకు ఫిబ్రవరి నెలలో జిల్లా సగటు భూగర్భ జలమట్టం 9.72 మీటర్లు దిగజారింది. ఆరు మండలాల్లో నీటి మట్టాలు ఆందోళనకరంగా ఉన్నట్లు తేలింది. 

 

మూడేళ్లుగా వేసవిలో ఆదిలాబాద్‌ అంతటా నీటి ఎద్దడి అధికంగానే ఉంటోంది. జలవనరులను పరిక్షించడమే ఈ సమస్యకు పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే వర్షాలు సైతం చెప్పుకోతగ్గ స్థాయిలో లేవు. గతేడాది పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉన్నా వర్షపునీటిని నిల్వ చేసుకునే మెలకువలపై రైతాంగానికి, ప్రజలకు పెద్దగా అవగాహన లేకుండా ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రాంగంతో పాటూ ప్రజలూ మేల్కొని కురిసే ప్రతి చినుకును భూమిలో ఇంకించుకుంటేనే రాబోయే రోజుల్లో నీటి కష్టాలను అధిగమించే అవకాశం ఉంటుందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు.. జిల్లాలో కురిసే వర్షం నీరులో 50 శాతం వాగులు, నదుల ద్వారా సముద్రంలో కలుస్తోంది. ఈ వృధాను అరికట్టి భూమిలోనే ఇంకిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఇంకుడుగుంతలు, చెరువుల పునరుద్ధరణ, కుంటలు, సేద్యపు కుంటలు, చెక్‌డ్యాంలను నిర్మిస్తే పరిస్థితి మెరుగుపడొచ్చని అంటున్నారు.

Related Posts