YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

'మూడెకరాలు' మందగమనం

 'మూడెకరాలు' మందగమనం

పేద దళితులకు అభ్యున్నతికి కృషి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. దీనికోసం వారికి మూడెకరాల భూమి అందించి అభివృద్ధిపథంలోకి తీసుకురావాలని సంకల్పించింది. మహోన్నతమైన ఈ ఆశయానికి భూముల కొరత ఇబ్బందిగా పరిణమించింది. ఈ పథకం అన్న ప్రాంతాల్లోనూ పూర్తికాని దుస్థితి. భూములు అందుబాటులో లేకపోవడంతో అనేకమంది లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తున్నా ఫలితం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఎందుకంటే భూముల సేకరణ అధికారులకు కష్టంగానే ఉంది. గుర్తించిన భూములను విక్రయించేందుకు కొందరు సుముఖత వ్యక్తంచేయడంలేదు. ఎట్టకేలకు ఒప్పుకున్నా ప్రభుత్వం చెల్లిస్తున్న ధర వారికి నచ్చడంలేదు. ఇలా వివిధ కారణాలతో భూముల సేకరణ జాప్యమవుతోంది. పేద దళిత కుటుంబాలకు మూడెకరాల భూమి అందిస్తే వారు స్థానికంగానే పంటలు సాగు చేసుకుని గౌరవప్రదమైన జీవనం సాగించగలరు. అందుకే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే భూముల కొరత దృష్ట్యా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

పేద దళితులను ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా గుర్తించి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సాగుకు అనుకూలమైన భూములను ఎంపిక చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. సాగుకు పనికిరాని భూమి అందించడం వల్ల ఉపయోగం ఉండదు. దీంతో అన్ని వనరులు ఉన్న వాటినే ఎంపిక చేయాలని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భూముల కొనుగోలు చేసేందుకు వెళ్తున్న సంబంధిత అధికారులకు ఒక్కోసారి ఒక ధరను యజమానులు చెప్తున్నారు. దీంతో ప్రభుత్వం తరపున భూముల ఎంపికలో జాప్యం ఉంటోందని సమాచారం. వికారాబాద్ జిల్లాలో లబ్ధిదారుల్లో కొందరికి భూములు ఇచ్చారు. ఇంకా 75మందికిపైగా భూమి అందించాల్సి ఉంది. ప్రస్తుతం  భూముల ధరలు అధికంగానే ఉన్నాయి. ఫలితంగా అంతమొత్తం వెచ్చించే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో భూముల కొనుగోలులో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. భూముల యజమానులు ప్రారంభంలో చెప్పిన ధర, మర్నాటికే అధికం చేస్తున్నారు. దీంతో భూ సేకరణకు ఎప్పటికప్పుడు బ్రేక్‌లు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా సర్కార్ త్వరితగతిన ఈ లక్ష్యాన్ని పూర్తి చేసి పేద దళితులకు భూ పంపిణీ పూర్తి చేయాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు. 

Related Posts