కడప, డిసెంబర్ 20,
ఉప్పెనలా వచ్చిన వరదతో కడప జిల్లాలోని చెయ్యేరు నదిపై నిర్మించిన అన్నమయ్య ఆనకట్ట పూర్తిగా కొట్టుకుపోయింది. అనేక గ్రామాలను ముంచెత్తింది. పులపుత్తూరు, తొగురుపేట, రామచంద్రాపురం,ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె,గుండ్లూరు, పాపరాజుపల్లె తదితర గ్రామాల్లో వేల సంఖ్యలో పశు సంపద, వందల ఎకరాల్లో పంటలు ధ్వంసమైన విషాద సంఘటన ఈ ప్రాంత వాసులను ఓ పీడకలగా వెంటాడుతూనే ఉంది. ఈ ఘటన జరిగి నేటికీ నెల రోజులు అవుతున్నా... ఇంకా 13 మంది వివరాలు లభించలేదు. గల్లంతైన వారి కుటుంబీకులను ఎవరిని కదిపినా కన్నీటి పర్యంతమవుతున్నారు. ఘటన జరిగిన తొలి వారంలో ఎక్కడ మృతదేహం దొరికినా తమ వారిదేమో అన్న ఆత్రుతతో క్షణక్షణం ఒక గండంలాగా గడిపారు. కుటుంబ సభ్యులు కానరాక ఆవేదనతో అనేకచోట్ల గాలింపు చేపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. చనిపోయిన, గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.ఐదు లక్షల చెక్కులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. నిన్న మొన్నటి వరకు కుటుంబంలో ఒకరిగా ఉన్న వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఆయా కుటుంబాలు కన్నీటి సంద్రంలో మునిగిపోయాయి. ఆచూకీ లభించని వారి కోసం రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కొద్దిరోజులు గాలించాయి. ఫలితం లేకపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేసింది.జల ప్రళయంలో 37 మంది గల్లంతు కాగా ఇంకా 13 మంది ఆచూకీ లభ్యం కాలేదు. వారి వివరాలు ఇలా వున్నాయి. పసుపులేటి జయరామయ్య (అన్నగారిపల్లె), షేక్ రషీద్ (దిగువపేట), బసిరెడ్డి వెంగళ్రెడ్డి (చొప్పావారిపల్లె), సింగరాజు వెంకటరాజు (పులపుత్తూరు), సంపతి ఎల్లయ్య (పులపుత్తూరు), గాడి ఈశ్వరమ్మ (రామచంద్రాపురం), చింతా సావిత్రమ్మ (రామచంద్రాపురం), మూరి విక్కీ (ఎగువ మందపల్లి), మూరి లహరి (ఎగువ మందపల్లె), కొర్రపాటి పావని (ఎగువ మందపల్లె), కొర్రపాటి నవ్యశ్రీ (ఎగువ మందపల్లె), ముప్పాళ్ల నాగరాజు (పాపరాజుపల్లె), షేక్సాబ్జాన్ (బాలరాజుపల్లె) వీరిలో ఉన్నారుగతంలో డ్యాం షట్టర్లు కొట్టుకుపోవడం, మోరాయించడం లాంటి సమస్యలను ఇరిగేషన్ అధికారులు చవిచూసినప్పటికీ ఎలాంటి పాఠాలు నేర్వలేదనీ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఆధునికీకరణ అవసరమైన నిధులు తెప్పించడంలోనూ, వరద ఉధృతిని అంచనా వేయడంలోనూ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించి ఇంతటి భారీ నష్టానికి కారకులు అయ్యారనే విమర్శలున్నాయి. ఇసుక మాఫియా ఇబ్బందులకు గురి కాకూడదనే దిగువకు వరద నీరు వదలక ఇంతటి నష్టానికి కారకులయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పులపుత్తూరు కు చెందిన బాధితురాలు పల్లం లక్షుమ్మ మాట్లాడుతూ మేమంతా ఊరు వెళ్లగా నా భర్త గ్రామంలో ఉన్నారు. వరద ఉధృతికి మా ఆయన, ఆవులు కొట్టుకు పోయారు. పెద్ద దిక్కును కోల్పోయాం. కట్టుబట్టలతో మిగిలిన తమకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలి. మనవడిని వరద పొట్టన పెట్టుకుంది. తొమ్మిది మంది చనిపోయారని అవేదన వ్యక్తం చేసింది.