విజయవాడ, డిసెంబర్ 20,
రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదు. నిధుల లేమితో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయి. కేంద్రం అరకొర నిధులివ్వడం, రాష్ట్రం ఆ నిధులకు కూడా తన వాటా జత చేయక పోవడం వల్ల పనులు ఆగిపోతున్నాయి. ఎనోసార్లు ఇన్కాప్, కేంద్రం దీనిపై భేటీలు నిర్వహించినప్పటికీ ఫలితం కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తాజా ఇవే అంశాలపై కేంద్ర పరిశ్రమల అభివృద్ధి, అంతర్గత వాణిజ్య శాఖలోని ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ అధికారులతో రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ భేటీ జరిగింది. ప్రాజెక్టులకు రాష్ట్రం భరించాల్సిన వాటా నిధులను కూడా విడుదల చేయాలని ఇన్కాప్ అధికారులు విజ్ఞప్తి చేశారు. విజయవాడ-గూడూరుకు మూడో లైన్ నిర్మాణాన్ని రూ.3246 కోట్లతో నిర్మించాలని 2019లో నిర్ణయించారు. దీనికోసం దాదాపు 600 నిర్మాణాలను తొలగించాల్సి ఉండగా, ఇప్పటివరకు 300 మాత్రమే తొలగించారని, మిగిలిన వాటిపై నెల్లూరు అధికారులు దృష్టి పెట్టడం లేదని పిఎంజి చెబుతోంది. భూసేకరణలో కూడా ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొంది. కొత్తపల్లి- నర్సాపూర్ లైనుకు సంబంధించి 2125 కోట్లతో 2019లో పనులకు ఆమోదం లభించినప్పటికీ నిధుల కొరత వేధిస్తున్నట్లు పిఎంజి చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు కూడా భూసేరకణ సమస్యగా మారినట్లు వివరించింది. విజయనగరం-టిట్లాఘర్ లైన్ నిర్మాణాన్ని రూ.2575 కోట్లతో నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికోసం విజయనగరం జిల్లాలో 150 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రూ.3038 కోట్లతో కడప- బెంగళూరు మార్గం పనులు చేపట్టాల్సి ఉండగా, 231 ఎకరాల భూసేరణ ఇంకా జరగలేదు. ఈ ప్రాజెక్టులో 50 శాతం రాష్ట్ర వాటాగా చెల్లించాల్సి ఉండగా, ఇప్పటివరకు 189 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసినట్లు చెబుతున్నారు. నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టును పదేళ్ల క్రితమే రూ.2289 కోట్ల అంచనాతో మంజూరు చేశారు. ఇందులో రాష్ట్రం 1145 కోట్ల వరకు భరించాల్సి ఉండగా కేవలం ఆరు కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు పిఎంజి పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భూ సేకరణ కూడా జరగడం లేదు. అలాగే రూ.3495 కోట్ల అంచనాతో ఖమ్మం-దేవరాపల్లి లైన్, రాయపూర్- విశాఖపట్నం ఆర్ధిక కారిడార్లో ఆరు లేన్లకు రూ.6432 కోట్లతో అంచనా పనులు, రూ.1863 కోట్లతో రేణిగుంట-నాయుడుపేట నిర్మాణాలు, రూ.1953 కోట్లతో కాజీపేట్- విజయవాడ పనులు, రూ.2500 కోట్లతో విజయవాడ-నర్సాపూర్ లైన్ పనులు, రూ.3631 కోట్లతో గుంటూరు-గుంతకల్ నిర్మాణాలు, వెయ్యి కోట్లతో ఎలహరక-పెనుకొరడ పనులు కూడా నత్తనడకన సాగుతున్నట్లు పిఎంజి పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఇన్కాప్ అధికారులు కేంద్ర నివేదికలను, పనుల పురోగతిని వివరిస్తూ రాష్ట్ర ఆర్ధికశాఖకు లేఖ రాశారు.