గుంటూరు, డిసెంబర్ 20,
పిఆర్సిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సంఘం సిఎంకు సమర్పించిన నివేదికలో పేర్కొన్న విధంగా సెంట్రల్ పే కమిషన్ సిఫార్సుల ఆధారంగా హెచ్ఆర్ఏ ఇస్తే వేతనాల్లో పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. ఏడు ప్రతిపాదనలు చేసినప్పటికీ అంతర్గతంగా పరిశీలన చేస్తే వేతనాల్లో పెద్దగా మార్పులు లేవు. అత్యధికంగా 27 శాతం ప్రతిపాదించారు. అంటే ఇప్పటికే ఐఆర్ ఇచ్చిన నేపధ్యంలో కొత్తగా పెరుగుదల ఉండకపోవచ్చు. ఒకవేళ సిఎం 30 శాతం ఇస్తే కొంత వరకూ పెరుగుదల ఉంటుంది. అదే సమయంలో సిపిసి ప్రకారం హెచ్ఆర్ఏలో తగ్గుదల ఉంటుంది. కనుక అనుకున్నస్థాయిలో మార్పులు ఉండవు. అదే సమయంలో సిపిసి ప్రకారం వేతనాలు పెంచాలంటే పదేళ్లకోసారి పెరుగుదల ఉంటుంది. సెంట్రల్ పే కమిషన్ పదేళ్లకు ఒకసారి మాత్రమే మార్పులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేళ్లకోసారి మార్పులు చేస్తుంటాయి. అలాగే రాష్ట్ర పిఆర్సి ప్రకారం హెచ్ఆర్ఏ ప్రధాన పట్టణాల్లో 30 శాతం వరకూ ఉంటుంది. సిపిసి ప్రకారం 20 శాతం ఉంటుంది. మూలవేతనం పెరిగే కొద్దీ హెచ్ఆర్ఏ శాతాన్ని తగ్గించుకుంటూ వస్తారు. దీనివల్ల పెరుగుదలలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉదాహరణకు రూ.40 వేల వేతనం ఉన్న ఉద్యోగికి ఐఆర్కు ముందు డిఏ 30 శాతం రూ.12 వేలు, హెచ్ఆర్ఏ 20 శాతం రూ.8000 మొత్తం రూ.60,000 వస్తుంది. ఐఆర్ ప్రకటించిన తరువాత రూ.40 వేల ఉద్యోగం ఉన్న వ్యక్తికి ఐఆర్ 27 శాతం రూ.10,800, డిఏ 30 శాతం రూ.12 వేలు, హెచ్ఆర్ఏ 20 శాతం రూ.8000 కలుపుకుంటే రూ.70,800 పొందుతారు. అంటే రూ.40వేల వేతనం ఉన్న ఉద్యోగి ఐఆర్కు ముందు రూ.60 వేల వేతనం తీసుకుంటుంటే 27 శాతం ఐఆర్ తరువాత రూ.70,800 పొందుతున్నారు. అదనంగా రూ.10,800 కలిసింది. ప్రస్తుతం ప్రకటించిన 27 శాతం ఫిట్మెంట్ అమలయితే వేతనం రూ.40 వేలు, డిఏ రూ.12 వేలు, కలిపి రూ.52 వేలు అవుతుంది. దీనికి 27 శాతం ఫిట్మెంట్ రూ.14,000 కలిపితే రూ.66,040 వస్తుంది. దీనికి హెచ్ఆర్ఏ 30 శాతం రూ.13,208 కలిపితే మొత్తం రూ.79,248 పొందనున్నాడు. అంతకుముందు ఐఆర్తో పోలిస్తే ప్రస్తుత పెరుగుదల రూ.8,448 ఉంటుంది. అదే 30 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే బేసిక్ రూ.67,600కు సిపిసి ప్రకారం హెచ్ఆర్ 20 శాతం ఇస్తే రూ.13,520 కలుస్తుంది. అంటే వేతనం రూ.81,120 అవుతుంది. 27 శాతం ఐఆర్ తీసుకున్న వేతనం రూ.70,800 పోలిస్తే అదనంగా రూ.10,320 వస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రతిపాదించిన లెక్కల్లో పెద్దగా పెరుగుదల కనిపించడం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు.