YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు తమ్ముళ్ల గొడవల పంచాయితీ

కర్నూలు తమ్ముళ్ల  గొడవల పంచాయితీ

కర్నూలు, డిసెంబర్ 20,
కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువే. రాష్ట్ర, ఢిల్లీ స్థాయిల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాళ్లే. కాకపోతే.. ఒకరంటే ఇంకొకరికి పడదు. పైకి నవ్వుతారు.. తెరవెనక కత్తులు దూసుకుంటారు. ఎప్పుడు కలిసి పోతారో తెలియదు.. ఎందుకు విడిపోతారో కూడా గుర్తించలేం. ప్రస్తుతం ఆ జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆసక్తికర వార్ జరుగుతోంది. అదే పార్టీలో పెద్ద చర్చ…రచ్చ..!టీడీపీలో క్రమశిక్షణ కనుమరుగవుతోందా? ఒక్క సీటూ గెలవలేని జిల్లాలో ఎవరేం చేసినా అధిష్ఠానానికి పట్టదా? వరస ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదా? కర్నూలు జిల్లా టీడీపీలో వినిపిస్తున్న ప్రశ్నలివి. పార్టీని బలోపేతం చేయడం కంటే.. బలహీనపర్చడానికే నేతలు ఎక్కువ కష్టపడుతున్నారన్నది కేడర్ అభిప్రాయం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ 3 చోట్ల గెలిస్తే.. 2019 ఎన్నికల్లో గుండు సున్నా. పంచాయితీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ చేతులు ఎత్తేశారు.కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్రెడ్డి ఎమ్మిగనూరులో టీడీపీ ఆఫీస్ ప్రారంభించారు. అక్కడి పార్టీ ఇంఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి కోట్ల తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు సైతం అభ్యంతరం తెలిపారట. ఈ విషయంలో కోట్ల వాదన ఎలా ఉన్నా.. కేంద్ర మాజీ మంత్రికి.. మాజీ ఎమ్మెల్యే బీవీకి మధ్య గ్యాప్ వచ్చిందన్నది పార్టీలో వినిపిస్తున్న మాట. ఈ చర్చ జరుగుతుండగానే మాజీ ఎమ్మెల్యే బీవీ లద్దగిరి వెళ్లి కోట్లతో భేటీ కావడం కేడర్ను ఆశ్చర్యపరిచింది.
ఆలూరు టీడీపీలోనూ ఆఫీస్ల రగడే. మాజీ ఇంచార్జ్ వీరభద్రగౌడ్ వేరేగా ఆఫీస్ తెరవడంతో.. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతకు వ్యతిరేకంగానే ఈ పనిచేశారని కేడర్ భావిస్తోంది. ఇద్దరి మధ్య పొలిటికల్ గ్యాప్ ఉండటంతో అంతా అదే అనుకుంటున్నారు. ఇదే టైమ్లో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ఆలూరుపై కన్నేశారనే చర్చ పార్టీలో సెగలు రేపుతోంది. త్వరలో ప్రభాకర్ సైతం టీడీపీ ఆఫీస్ ఏర్పాటు చేసుకుంటారట. టీడీపీ అధిష్ఠానం ఆదేశిస్తే ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా లేదంటే కర్నూలు ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు ప్రభాకర్. కర్నూలు ఎంపీగా కోట్ల సూర్యప్రకాష్రెడ్డి, ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా కోట్ల సుజాత పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో కేఈ ప్రభాకర్ తీరు కొత్త చర్చకు దారితీస్తోంది.డోన్ నియోజకవర్గ ఇంఛార్జ్ను మార్చాలని కేఈ ప్రభాకర్ అనుచరుడు, ప్యాపిలి మాజీ ఎంపీపీ శ్రీనివాసులు కరపత్రాలతో యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఇంఛార్జ్గా ధర్మారం సుబ్బారెడ్డి ఇటీవలే వచ్చారు. సుబ్బారెడ్డి ఇంఛార్జ్గా వచ్చాక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్రెడ్డి సొంతూరు బేతంచర్ల మున్సిపాలిటీలో ఆరు వార్డులను టీడీపీ గెల్చుకుంది. అయితే సుబ్బారెడ్డి గతంలో కాంగ్రెస్లో ఉండగా కోట్ల సుజాతకు, వైసీపీలో ఉండగా బుగ్గనకు వెన్నుపోటు పొడిచారని శ్రీనివాసులు పంచుతున్న కరపత్రాల్లో ఆరోపించారు. ఇప్పుడు టీడీపీలో వెన్నుపోటు పొడవబోరని గ్యారెంటీ ఏంటని ప్రశ్నలు కురిపించారు. సుబ్బారెడ్డిని పదవి నుంచి తప్పుకోవాలని.. ఇంఛార్జ్గా కేఈ కుటుంబమే ఉండాలని కరపత్రాల్లో కోరడంతో రచ్చ రచ్చ అవుతోంది.అసలే కష్టకాలంలో ఉన్న సమయంలో ఈ పరిణామాలు కర్నూలు జిల్లా టీడీపీ కేడర్ను అయోమయంలో పడేస్తున్నాయట. ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా పార్టీలో ఏం జరుగుతుందో తెలియక గందరగోళంలో ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల వరకు నాయకులు ఇలాగే ఉంటే.. 2019 ఫలితాలే వస్తాయని తమ్ముళ్లు హెచ్చరిస్తున్నారట.

Related Posts