YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నిప్పుల కుంపటి

నిప్పుల కుంపటి

రోజురోజుకు భానుడిప్రతాపం అధికమైపోతోంది. సూరీడు నిప్పులు కుమ్మరిస్తున్నాడా అన్నట్టుగా ఎండ ఠారెత్తిస్తోంది. టెంపరేచర్లు పీక్స్ కు చేరుతుండడంతో ఆ వేడికి తట్టుకోలేక జనం అల్లాడుతున్నారు. నిర్మల్‌లో పలు ప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతుండడంతో ప్రజలు రోడ్లపైకి రావాలంటేనే హడలిపోతున్నారు. ఉదయం 8 గంటలకే ఎండ వేడిమి పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో వివిధ పనుల మీద బయటకు వెళ్లే వారు భారీ రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. మాస్కులు, ఇతర రక్షణ వస్త్రాలు ధరించే కాలు బయటపెడుతున్నారు. రహదారులపై చిరువ్యాపారం చేసుకొనే వారు గొడుగుల సాయంతో ఎండ నుంచి రక్షణ పొందుతున్నారు. వేసవి నేస్తాలుగా భావించే ఏసీలు, కూలర్లు, రంజన్లకు గిరాకీ బాగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే జనాలు చెట్లనీడన సేదతీరుతున్నారు. ఎండ తీవ్రత వల్ల ప్రయాణికుల పాట్లైతే వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక ఆఫీసులకు వెళ్లేవారు, రోజువారీ కూలీలు నానాపాట్లు పడుతున్నారు. 

 

వాతావరణంలో చల్లదనం పూర్తిగా పోయింది. సాయంత్రం ఆరు గంటలవుతున్నా కొన్ని ప్రాంతాల్లో వేడిమి తగ్గని పరిస్థితి. దీంతో ప్రజలు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఆన్‌ చేసుకుని వాటి ముందే ఉంటున్నారు. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరిగింది. అడపాదడపా వానలు కురుస్తున్నా వేడిమి మాత్రం అలాగే ఉంటోంది. మే నెలలో ఎండలు దారుణంగా ఉంటాయి. వడగాడ్పుల తీవ్రతా అధికంగానే ఉంటుంది. ఈ సంగతి తెలిసిందే. అయితే కొంతకాలంగా కనీవిని ఎరుగని ఎండను ప్రజలు చూస్తున్నారు. భవిష్యత్‌లో ఇది ఇంకెంత ఉగ్రరూపం దాల్చుతుందోనని భయపడుతున్నారు. ఇదిలా ఉంటే పెరిగిపోతున్న ఎండలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని స్పష్టం చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితేనే బయటకు రావాలని, ఎండలో ఎక్కువ సేపు తిరగవద్దని సూచించారు. ఎండ నుంచి రక్షణగా గొడుగులు లేదా మాస్కులు తప్పనిసరిగా వాడాలని పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్ధాలు తీసుకుని శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకోవాలని చెప్పారు. 

Related Posts