ముంబై డిసెంబర్ 20
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్ లీక్ కేసులో అమితాబ్‌బచ్చన్ కుటుంబానికి సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌ను విచారించిన ఈడీ తాజాగా ఆయన భార్య ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు నోటీసులు జారీచేసింది. ఇవాళ విచారణకు హాజరుకావాలంటూ ఆ నోటీసులలో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ ఐశ్వర్యారాయ్ ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్‌లో ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు.కాగా, ఈ కేసులో ఐశ్వరాయ్ బచ్చన్‌ను ప్రశ్నించేందుకు ఇప్పటికే పశ్నల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. పనామా పేపర్ లీక్ కేసులో 500 మంది భారతీయులకు ప్రమేయం ఉన్నది. వారిలో రాజకీయ నాయకులు, నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు తదితరుల పేర్లు ఉన్నాయి. వీరంతా ప్రభుత్వానికి పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారు.