న్యూఢిల్లీ డిసెంబర్ 20
బ్యాంకుల వద్ద రుణం తీసుకుని ఎగవేసిన డిఫాల్టర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూల్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా లాంటి డిఫాల్టర్లకు చెందిన ఆస్తులను అమ్మి సుమారు 13,109 కోట్లు వసూల్ చేసినట్లు మంత్రి వెల్లడించారు. మనీల్యాండ్ చట్టం ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలు డిఫాల్టర్లకు చెందిన ఆస్తులను సీజ్ చేసినట్లు ఆమె చెప్పారు. విజయ్ మాల్యా దివాళా తీసినట్లు ఇటీవల బ్రిటీష్ కోర్టు తెలిపింది. అయితే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఆస్తులను అమ్మి .. భారతీయ బ్యాంకులకు బాకీపడ్డ రుణాలను చెల్లించాలని ఆ కోర్టు తన తీర్పులో ఆదేశించింది.65 ఏళ్ల మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో బెయిల్‌పై ఉంటున్నారు. ఎస్బీఐ బ్యాంకులకు మాల్యా సుమారు 9 వేల కోట్ల రుణాన్ని ఎగవేశారు. ఇక పీఎన్బీ బ్యాంకుల వద్ద నీరవ్ మోదీ సుమారు 13 వేల కోట్ల రుణం తీసుకుని ఎగవేశారు. గడిచిన ఏడేళ్లలో మిగిలి ఉన్న రుణాల నుంచి 5.49 లక్షల కోట్లు రికవరీ చేసినట్లు మంత్రి సీతారామన్ తెలిపారు.ఒక్క రెండు రాష్ట్రాలు మాత్రమే నెగటివ్ క్యాష్ బ్యాలెన్స్‌లో ఉన్నట్లు ఆమె చెప్పారు.