కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్లేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ కార్యదర్శి ఉమెన్ చాందీ పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సమావేశం సందర్భంగా విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, ఏఐసీసీ కార్యదర్శి ఉమెన్ చాందీ, మెయ్యప్పన్, క్రిష్టఫర్, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకె శైలజానాథ్, సీడబ్ల్యూసీ ఆహ్వానితులు చింతా మోహన్, కాంగ్రెస్ ఆర్గనైజేషన్ కార్యదర్శి రాజీవ్రతన్ తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ప్రారంభానికి ముందు ఇటీవల దివంగతులైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు పార్టీ నేతలు, కార్యకర్తలు నివాళులర్పించారు. కార్యవర్గ సమావేశానికి అన్ని జిల్లాల నుంచి పార్టీ నేతలు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జన జాగరణ అభయాన్, సభ్యత్వ నమోదు, సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అన్ని జిల్లాల్లో నిర్వహించిన పాదయాత్రలపై సుదీర్ఘంగా చర్చించారు. భవిష్యత్తులో పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న అంశంపై ఉమెన్ చాందీ కాంగ్రెస్ నేతలు దిశానిర్దేశం చేశారు.