న్యూఢిల్లీ, డిసెంబర్ 22,
అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్‌లు బయట పడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు తలమునకలయ్యాయి. కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టినా మరికొన్ని దేశాల్లోనైతే డెల్టా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా ఎఫెక్ట్‌తో పలు దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. అందుకే సంపూర్ణ లాక్‌డౌన్ కూడా విధించలేక పాక్షిక లాక్‌డౌన్, కోవిడ్ నిబంధనలకే పరిమితమయ్యాయి. భారత్‌లో కూడా ఆర్థికంగా ప్రభుత్వాలపై భారం పడటం, డెల్టా వేరియంట్ ప్రభావం తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు సెకండ్ వేవ్‌పై కూడా ఎక్కవుగా ఆంక్షలు విధంచలేదు. అయితే ఇప్పడు వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా కంటే 6 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ బారిన పడిన దేశాల్లో ఒకటైన యూకేలో ఇప్పటికే ఒమిక్రాన్ మరణాలు మొదలయ్యాయి. ఈ రోజు తాజాగా అమెరికాలోని టెక్సాస్‌లో ఒక ఒమిక్రాన్ మరణం సంభవించింది. ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించిన ఒమిక్రాన్ వేరియంట్ పలు రాష్ట్రాల్లో దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లో ఉన్న జనాభా ప్రకారం ఒమిక్రాన్ వ్యాప్తి ఇక్కడ మరింత వేగంగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ ఎదుర్కునేందుకు ఎలాంటి ఆలోచనలు చేస్తోందని కొందరు ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఇటీవల ఒమిక్రాన్‌పై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్‌పై కోవిడ్ టీకాలు సైతం ప్రభావం చూపడం లేదని స్పష్టం చేశారు. దీంతో బూస్టర్ డోస్‌పై కూడా స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ నెల డిసెంబర్ కావడంతో 25వ తేదీన క్రిస్మస్ పండుగతో పాటు న్యూయర్ వేడుకల్లో యువత భారీగా పాల్గొనే అవకాశం ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తికి వేదికగా ఈ న్యూయర్ వేడుకలు ఆతిథ్యమిచ్చేలా కనిపిస్తున్నాయి. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వీటిపై అధికారికంగా స్పష్టత లేదు. ఫస్ట్, సెకండ్ లాక్‌డౌన్‌లు విధించినప్పుడే ఆర్థికంగా కుదేలైన భారత్‌లో మరోసారి ఒమిక్రాన్ వ్యాప్తి వేళ లాక్‌డౌన్‌కు ఆస్కారం ఉందా.. లేదా..? అనే సందేహాలు ప్రజలు మదిలో మెదులుతున్నాయి.